ఈమాటన్నది ఎవరో కాదు.. ‘అల వైకుంఠపురములో’ శాడిస్ట్ తండ్రిగా నటించిన మురళి శర్మ... చెప్పిన మాట. అల్లు అర్జున్ ఓ భయంకరమైననటుడు అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని, గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో నటించినప్పుడు ఓ హాస్యభరిత చిత్రం చెయ్యాలని త్రివిక్రమ్ చెప్పారని అది అల వైకుంఠపురములో సినిమాతో తీరిందని చెబుతున్నాడు. తన కెరీర్‌లోనే ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రని అల వైకుంఠపురములో త్రివిక్రమ్ తనకి ఇచ్చాడని చెబుతున్నాడు. మరి ఆ సినిమాలో వాల్మీకిగా మురళీశర్మ నటనకు మంచి కాదు.. టాప్ మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ తర్వాత అంతగా పేరొచ్చింది కేవలం మురళి శర్మకే.
వాల్మీకి -బంటు(అల్లు అర్జున్) మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. మరి అల్లు అర్జున్ ఓ భయంకరమైన నటుడని, సెట్ లో స్టార్ హీరోలా అస్సలు ప్రవర్తించడని, తనకి ఇచ్చిన పాత్రలో పూర్తిగా లీనమవుతాడని చెబుతున్నాడు. మరి అల వైకుంఠపురములో శాడిస్ట్ తండ్రి వాల్మీకిగా మురళి శర్మ పాత్రని ఇప్పట్లో అయితే ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమా చెయ్యక ముందు గంట వాకింగ్ చేసే మురళి శర్మ ఈ సినిమా తర్వాత గంటన్నర వాకింగ్ చేస్తున్నాడట. కారణం తానూ వాకింగ్ చేస్తుంటే అందరూ ఆపి అల వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే మాట్లాడుతున్నారట. అలాగే ఆ సినిమా తర్వాత తనకి ఫోన్ కాల్స్ కూడా ఎక్కువయ్యాయని అల ముచ్చట్లను అలా అలా చెప్పుకొచ్చాడు.