టైటిల్ చూడగానే షాకయ్యారు కదూ..? అవునండోయ్ మీరు వింటున్నది నిజమే.. RRR చిత్రంలో దగ్గుబాటి రానా నటించబోతున్నాడట. అదేంటి.. జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’ తెరకెక్కిస్తున్నారుగా మళ్లీ రానా హీరోగా సినిమా ఏంటి..? కొంపదీసి ఆ ఇద్దరు హీరోలను రానా ఢీ కొట్టబోతున్నాడా..? ఏంటనే డౌట్ వస్తోంది కదూ..? మీ సందేహాలకు సమాధానం దొరకాలంటే ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రత్యేక కథనం చదివేయండి మరి.
టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ‘బాహుబలి’ సినిమా తర్వాత రానా లాంగ్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు అన్నీ లవ్, పొలిటికల్ టచ్ ఇలా విభిన్న కథలుండే చిత్రాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాగా.. ఇప్పటికే రానాను హీరోగా పెట్టి ‘నేనేరాజు నేనేమంత్రి’ అనే చిత్రాన్ని తేజ తెరకెక్కించిన విషయం విదితమే. ఈ సినిమా హిట్టవ్వడంతో తానింకా క్రీజులోనే ఉన్నానని తేజ నిరూపించుకున్నాడు. మరోవైపు.. రానాకు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అయితే ఇదే కాంబోలో మరో సినిమా చేయాలని తేజ భావించాడట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటను రానా చెవిన వేయడంతో ‘నేను రెఢీ సార్ మీరెప్పుడు అంటే అప్పుడే’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
ఈ సినిమా పేరు ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అంటే ‘RRR’ అన్న మాట. ఇందులో రానా పాత్ర ఇదివరకెప్పుడూ లేని విధంగా చాలా విభిన్నంగా ఉంటుందట. ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’లో నటిస్తుండగా ఆ తర్వాత ‘హిరణ్యకశిప’ చేయాల్సి ఉంది. అయితే ‘హిరణ్యకశిప’ను కొద్దిరోజులపాటు పక్కనెడతానని తేజకు రానా మాటిచ్చాడట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరత్వరగా షూటింగ్ ప్రారంభించేయాలని.. జక్కన్న కంటే ముందే తేజ తన ‘RRR’ థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నాడట. ఇందులో నిజానిజాలెంతో అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ తెలిసేలా లేదు మరి.