విజయ్ దేవరకొండకి ‘అర్జున్ రెడ్డి’ క్రేజ్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే విజయ్ దేవరకొండకి ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అర్జున్ రెడ్డి క్రేజ్‌తో బాలీవుడ్‌లో కరణ్ జోహార్‌లాంటి పెద్ద నిర్మాతని పట్టడమే కాదు.. పూరి డైరెక్షన్ లో ఆ సినిమాని మొదలెట్టాడు కూడా. అయితే అర్జున్ రెడ్డి క్రేజ్‌తో విజయ్ దేవరకొండ తన డియర్ కామ్రేడ్‌తో బాలీవుడ్‌లో మొదటగా జెండా పాతేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వర్కౌట్ అవ్వక హిందీలో చేసే ఆలోచన విరమించుకున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ పోయినా.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ అక్కడ ఏమాత్రం తగ్గలేదు.
ఇక్కడ ప్లాప్ అయిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్‌ని బాలీవుడ్ జనాలు యూట్యూబ్‌లో ఎగబడి చూసారు. డియర్ కామ్రేడ్ సినిమాని హిందీ ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారు అంటే... రెండు రోజుల క్రితమే విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆ సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ కూడా అదిరిపోయిందంటూ బాలీవుడ్ ప్రేక్షకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కేవలం విజయ్ దేవరకొండ మీదున్న క్రేజ్ తోనే విజయ్ యాక్టింగ్ చూడాలనే అక్కడి ప్రేక్షకులు డియర్ కామ్రేడ్‌ని యూట్యూబ్ లో చూసి రికార్డులు సృష్టిస్తున్నారు. మరి విజయ్ కి తన క్రేజ్ ముందే తెలుసు గనక బాలీవుడ్ లో పూరితో కలిసి పాగా వెయ్యడానికి, క్రేజ్ ని వినియోగించుకుని బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడెయ్యడానికి రెడీ అయ్యాడన్నమాట.