నన్ను సరికొత్తగా చూడాలన్న నాన్నగారి అభిమానుల, నా అభిమానుల కోరికను ‘సరిలేరు నీకెవ్వరు’తో నెరవేర్చిన అనిల్ రావిపూడిగారికి థ్యాంక్యూ: సూపర్‌స్టార్ మహేశ్.
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌ను జనవరి 17 (శనివారం)న వరంగల్ హన్మకొండ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సిపి రవిందర్ పాల్గొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మొదటివారంలోనే 100 కోట్ల షేర్ రాబట్టిన సందర్భంగా చిత్ర డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంయుక్తంగా పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...
మీ ప్రేమకు, అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ!!
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ.. ‘‘అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో గొప్ప డైలాగ్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ రమణ లోడ్ ఎత్తాలిరా.. అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. ఈరోజు స్వామి వారి దర్శనం తర్వాత వరంగల్‌కి వచ్చి ప్రేక్షకులకు కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ 7 రోజుల్లో రూ.100 కోట్లు సాధించిందనే విషయాన్ని చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. వారికి ఈ వేదికపై థ్యాంక్స్ చెబుతున్నాను. యాక్షన్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్‌కి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారికి, ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్. కథ వినగానే, మాస్ సాంగ్ చేయడానికి ఛాన్స్ ఉందని అప్పుడే దేవిశ్రీ చెప్పాడు. అలా వచ్చిందే మైండ్ బ్లాక్ సాంగ్. అలాగే శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. నా 20 ఏళ్ళ కెరీర్‌లో ఇంత రెస్పాన్స్‌ను ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. శేఖర్ మాస్టర్, దేవిశ్రీ , అనిల్ రావిపూడికి థ్యాంక్స్. విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రానికి పనిచేశాను. తర్వాత ఆవిడతో థర్టీ ఇయర్స్ తర్వాత పనిచేసే అవకాశం ఈ సినిమాకే కలిగింది. ఆవిడను కలిసినప్పుడు ‘కొడుకు దిద్దిన కాపురం’ నిన్నే చేసినట్లు అనిపించింది. ‘కొడుకు దిద్దిన కాపురం’ పెద్ద హిట్టు.. ‘సరిలేరు నీకెవ్వరు’ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెతో పనిచేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. మళ్లీ ఆవిడతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. రష్మిక స్వీటెస్ట్ కోస్టార్. రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం అమేజింగ్‌గా అనిపించింది.
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత దిల్‌రాజుగారితో ఈ సినిమాకు పనిచేయడం చాలా గొప్పగా ఉంది. హ్యాట్రిక్ హిట్ సాధించాం. దిల్‌రాజుగారు కేవలం నిర్మాత మాత్రమే కాదు.. మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. సినిమాను ప్రేక్షకులకు ఎలా రీచ్ చేయించాలో బాగా తెలిసిన నిర్మాత. ఆయనతో కలిసి మరో హ్యాట్రిక్ ఇవ్వబోతున్నాం. ఇక నిర్మాత అనిల్ సుంకర విషయానికి వస్తే .. అందరి కంటే ఆయన పెద్ద అభిమాని. ఈరోజు ఆయన కోరిక తీరినందుకు ఆనందంగా ఉంది. ఆయనతో జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్టర్ అనిల్ .. తను ముందు 40 నిమిషాల నేరేషన్ మాత్రమే ఇచ్చాడు. తనలో ఎనర్జీ చూసి ఇది ముందు చేయడానికి కుదురుతుందా? అనగానే మొత్తం స్క్రిప్ట్‌ను రెండు నెలల్లోనే సిద్ధం చేసి ఇచ్చాడు. దానికి కారణం నాన్నగారి, నా అభిమానులే. నాలుగైదేళ్లుగా అందరూ కొత్త మహేష్ కోరుకుంటున్నారని తెలుసు. కంటెంట్ బేస్డ్ సినిమాలు, వేరే జోనర్ సినిమాలు చేశాను. సినిమా చేసేటప్పుడు అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. ప్రేక్షకులు, అభిమానులను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాను. నా కెరీర్‌లో నేను తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదేనని ఫీల్ అవుతున్నాను. నాన్నగారి అభిమానులు, నా అభిమానుల తరపున అనిల్‌కి థ్యాంక్స్. వారి కోరికను తీర్చాను. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. ప్రేక్షకుల అభిమానుల అభిమానం వల్లే ఇలా దొరికింది. మీ ప్రేమకు, అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ.. థ్యాంక్యూ’’ అన్నారు.