టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీల హవా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజై సూపర్ డూపర్ హిట్‌లు కొట్టాయి.. కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వాస్తవానికి అక్కినేని కుటుంబ సభ్యులు నటించిన ‘మనం’ సినిమా తర్వాత చాలా మంది ఇలా చేయాలని భగీరథ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికీ వర్కవుట్ అవ్వట్లేదు. మరీ ముఖ్యంగా నందమూరి, మెగా ఫ్యామిలీ నుంచి ఇలాంటి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వీరాభిమానులు ఎంతగానే వేచి చూస్తున్నారు. అయితే తాజాగా ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మల్టీస్టారర్‌పై నందమూరి వారబ్బాయ్ కల్యాణ్ పెదవి విప్పాడు.
‘మనం’ సినిమా చూశాను. అప్పుడు ఈ కథకు మనకు రాలేదే అనిపించింది. మూవీ చూసిన తర్వాత మా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో సినిమా చేయాలని అనిపించింది. బాబాయ్ బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్, నేను కలిసి ఒక సినిమా చేస్తే బాగుండు అనిపించింది. నిజంగా చెప్పాలంటే అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్. బాబాయ్ సపోర్ట్ నాకు మొదట్నుంచీ ఉంది. ఏ సీన్ అయినా టేక్ వన్‌లోనే చేసేయాలి. టేక్ టూ లోనే చేసేయాలి అనేవి పెట్టుకోకు. నీ మనసుకు నచ్చేంతవరకూ చేస్తూనే ఉండు. చుట్టూ ఎంతమంది పబ్లిక్ వున్నా .. గొప్ప ఆర్టిస్టుల కాంబినేషన్ అయినా.. ఎవరు చూస్తున్నా నువ్వు సంతృప్తి చెందేవరకూ చేస్తూనే వుండు అని బాబాయ్ నాకు చెప్పారు. నాటి నుంచి నేటి వరకూ నేను అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను’ అని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి చూస్తే.. ‘మనం’ రేంజ్‌లో సినిమా తీయాలనే మనసులోని మాటను కల్యాణ్ రామ్ బయటపెట్టాడు. నందమూరి కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ నుంచి వచ్చింది గనుక.. సినిమా తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ ముందుకొస్తాడో వేచి చూడాల్సిందే మరి.