‘మన దగ్గర బేరాల్లేవమ్మా.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి బరిలోకి దిగిన మహేశ్ నిజంగానే అనుకున్నట్లుగా ‘సరిలేరు నాకెవ్వరూ’ అని అనిపించుకున్నాడు. నిజంగానే బొమ్మ మాత్రం దద్దరిల్లిపోయింది. కామెడీ, యాక్షన్ ఇలా అన్ని కోణాలనూ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి చూపించాడు. వాస్తవానికి అనిల్ సినిమా అంటే కామెడీకి కొదవుండదు.. అయితే ఈ సినిమాలో మాత్రం అంతకు మించి అంటూ పొట్ట చెక్కయ్యేలా నవ్వించి.. యాక్షన్ సీన్స్ సీన్ సీతార చేసేశాడు. సినిమా కలెక్షన్స్ పరంగా చూసినా.. టాక్ పరంగా చూసినా అదిరిపోయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్‌ను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో భాగంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకోవాల్సి వచ్చింది..? ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఎవరిది..? అనే విషయాలను పంచుకున్నాడు.
క్రెడిట్ అనిల్‌కే..!
‘ఎఫ్2 సినిమాకు ముందే సరిలేరు స్క్రిప్ట్‌ను అనిల్ నాకు చెప్పాడు. అయితే నాకు వేరే సినిమాలు కమిట్మెంట్స్ ఉండటంతో చేయలేదు.. తర్వాత చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత నేను నా సినిమాలో.. అనిల్ ఎఫ్2 లోకి దిగిపోయాం. ఎఫ్2 సినిమా రిలీజ్ అయిన కొన్నిరోజులకు నేను అనిల్‌కు ఫోన్ చేసి మూవీ చేద్దామని అడిగాను. కేవలం రెండు నెలల్లోనే ఆయన స్క్రిప్ట్ రాసుకొచ్చాడు. సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి నా ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. చాలా మంది నుంచి నాకు ప్రశంసలు వస్తున్నాయ్. ఈ క్రెడిట్ మొత్తం అనిల్‌కే దక్కుతుంది. ఈ మూవీకి ఈ రేంజ్‌లో స్పందన వస్తుందని ఊహించలేదు.. కానీ అనిల్‌కు మాత్రం నమ్మకం ఉంది’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు.
బాహుబలిలో ప్రభాస్ లాగా!
మరోవైపు అనిల్ మాట్లాడుతూ.. ‘బహుబలి’లో ప్రభాస్ శివ లింగాన్ని పైకెత్తినట్లుగా సరిలేరు సినిమా మొత్తం తన భుజాలపై మహేశ్ మోశారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా థ్యాంక్స్’ అని తెలియజేశారు. కాగా.. ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.32.77 కోట్ల షేర్ దక్కినట్లు వస్తున్న వార్తలతో మహేశ్ వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొత్తానికి చూస్తే.. మహేశ్‌కు ఈ రేంజ్ హిట్టవుతుందని నమ్మలేకపోయినా.. అనిల్ నమ్మకం నిజమైందన్న మాట. ఇప్పటికే మరోసారి అనిల్‌తో సినిమా చేస్తానని మహేశ్ చెప్పుకొచ్చాడు.. మరి అది వర్కవుట్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే.