టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఈ సినిమా జనవరి-12న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్తున్న చిత్రబృందం తాజాగా.. మ్యూజికల్ కాన్‌సర్ట్ పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికైంది. ఈ వేడుకను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మెగాభిమానులు, బన్నీ వీరాభిమానులు తరలివచ్చారు.
అసలేం జరిగింది..!
ఈ వేడుకను నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌ను శ్రేయాస్ మీడియా, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్వహించాయి. అయితే.. ఈ ఈవెంట్ మేనేజర్లపై జూబ్లిహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి తీసుకున్న సమయానికి కార్యక్రమం ముగించకపోవడం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం.. ఫ్యాన్స్ సంఖ్య విషయంలో ఇలా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదుచేయడం జరిగింది. ఈ కేసు విషయమై పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
తప్పుడు సమాచారం.. తొక్కిసలాట!
‘శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, నిర్మాణ సంస్థ మేనేజర్ యగ్నేశ్‌లపై కేసు నమోదు చేశాం. సుమారు 5 నుంచి 6 వేల మంది వరకూ అభిమానులు వస్తారని.. రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమం ముగుస్తుంది మా దగ్గర అనుమతి తీసుకున్నారు. అయితే దాదాపు 15 వేల మందిని నిర్మాణ సంస్థ ఆహ్వానించింది.. ఆరు వేల మంది దాటరని చెప్పి, మరింత మందిని తరలించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రి 11.30 గంటల వరకూ కార్యక్రమం జరిగింది. స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పోలీసులు అభిమానులను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశాం’ అని పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయమై ఇంతవరకూ అటు చిత్రబృందం కానీ.. మరీ ముఖ్యంగా నిర్వహణ, నిర్మాణ సంస్థలు స్పందించకపోవడం గమనార్హం.