మహాకార్యాలను నిర్వహించడానికి పవిత్ర హృదయంతోపాటు నిశ్చలమైన భక్తి ఉండటం వల్లనే ‘శ్రీనివాసో విజయతే’ వంటి అపురూప గ్రంధాలను వేలకొలది భక్తగణానికి నందమూరి బాలకృష్ణ , సాయి కొర్రపాటి సమర్పించగలిగారని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’ అర్చక బృందం, వేదం పండిత వర్గం ఆశీర్వచన పూర్వక ప్రశంసలు వర్షించింది.
తిరుమల శ్రీనివాసుని అఖండప్రకాశంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అనిర్వచనీయ అనుభూతితో అందించిన పవిత్ర సొగసుల అమృతమయ గ్రంధం ‘శ్రీనివాసో విజయతే’ ఏడువేల ప్రతులను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలదేవస్థానం అధికారులకు హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సోమవారం ఉదయం అందజేశారు.
శుభలక్షణాల తిరుమల శ్రీనివాసుని శ్రీమంతతను ఎంతో శక్తిమంతంగా ఆవిష్కరించిన ఈ దివ్య గ్రంధాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ప్రచురించగా, ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజని కొర్రపాటి సౌజన్యంతో ద్వారకా తిరుమలేశుడు పాదాల చెంతకు చేరాయి.
గతంలో నందమూరి బాలకృష్ణ సమర్పణలో దేశంలోనే తొలిసారిగా అతి అరుదైన ఐదువందల అఖండ ఆంజనేయ చిత్రాలతో, యంత్ర మంత్రాత్మకంగా వారాహి సంస్థ ప్రచురించిన ‘నేనున్నాను’ మహాగ్రంధానికి కూడా పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వ్యవహరించి జాతీయస్థాయిలో పవిత్ర సంచలనం సృష్టించారు.
వైకుంఠఏకాదశి సందర్భంగా ఈ శ్రీనివాసో విజయతే పవిత్ర గ్రంధాలను వేలాది భక్తులకు సాయి కొర్రపాటి ఉచితంగా అందిండంతో, ద్వారకా తిరుమలేశుడు అనుగ్రహంగా వేలాది భక్తులు వైకుంఠ ఏకాదశి ప్రసాదంగా పులకించిపోవడం కనిపించడం విశేషం.