సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు.జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నారు. కాగా ’సరిలేరు నీకెవ్వరు’ మెగాసూపర్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్‌ని విడుదలచేశారు.ఈ సందర్భంగా..
సూపర్‌స్టార్ మహేశ్ మాట్లాడుతూ.. ‘ఈరోజు నిజంగానే అద్భుతమైన రోజు. మా డైరెక్టర్ అనిల్‌కి కొడుకు పుట్టాడు. అలాగే మా నిర్మాత దిల్‌రాజుగారు మరోసారి తాతగారయ్యారు. ఆయనింటికి ఓ ఆడపిల్ల వచ్చింది. ఇన్ని మంచి విషయాలు ఒకేరోజు జరిగింది. అన్నింటికీ మంచి మేం పిలవగానే మెగాస్టార్ చిరంజీవిగారు ఈ వేడుకకి రావడం గొప్ప విషయం. మా టీం ఈ విషయాన్ని ఎప్పటీకి మరచిపోదు. ‘ఒక్కడు’ సినిమా చూసి ఆయన చెప్పిన మాటలు నాకెంతో ఇన్‌స్పిరేషన్ ఇచ్చాయి. అలాగే ‘అర్జున్’ సమయంలో మా సెట్‌కు వచ్చి నీలాంటి వాళ్లు ఇండస్ట్రీకి అవసరం.. ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన మాటలు. ఇంకా నాకు గుర్తే.‘పోకిరి’ సమయంలోనూ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్లి కలిశాను. సినిమా గురించి, నా పెర్ఫామెన్స్ గురించి రెండుగంటల పాటు మాట్లాడారు. ఆ మాటలను నేనింకా మరచిపోలేదు. ఆయన ఎప్పుడు నాకు ఇన్‌స్పిరేషనే. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ పోన్ కాల్ ఆయన దగ్గర నుండే నాకు వస్తుంది. జనవరి 11న కూడా ఆయన దగ్గర నుండి తొలి ఫోన్ రావాలని కోరుకుంటున్నాను. విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ పనిచేశాను. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే డేడికేషన్‌తో ఉన్నారు. ఆమెకు మేం అవకాశం ఇచ్చారని ఆమె చెప్పారు కానీ.. నిజానికి ఈ సినిమా చేయడానికి ఒప్పుకుని ఆమె మాకు అవకాశం ఇచ్చారు.
స్క్రిప్ట్ విన్న తర్వాత విజయశాంతిగారు ఒప్పుకుంటారో లేదో అన్నాను. కానీ తను ఆమెను ఒప్పించాడు. భారతి క్యారెక్టర్‌ను ఆమె తప్ప మరొకరు చేయలేరు. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. డైరెక్టర్ అనిల్ గురించి చెప్పాలంటే.. నేను చాలా మందితో పనిచేశాను కానీ, ఓ డైరెక్టర్‌లో అంత పాజిటివ్ ఎనర్జీని నేనెప్పుడూ చూడలేదు. నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేశాను. జూలై 4న సినిమాను స్టార్ట్ చేస్తే డిసెంబర్ 18న షూటింగ్ అయిపోయింది. నేనెప్పుడూ అంత ఫాస్ట్‌గా సినిమా చేయలేదు. దానికి కారణం అనిలే. ప్రతిరోజూ ఓ ఎనర్జితో పనిచేశాం. ఇన్‌టెన్స్ సీన్స్‌ను కూడా హాయిగా చేశాం. రేపు అది సినిమాలో కనపడుతుంది. నేను మాస్ సినిమా చేసి చాలారోజులైందని ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎప్పుడైనా కథ నచ్చితేనే చేస్తాను. అనిల్ రావిపూడి కథ నచ్చింది. చేశాను. జనవరి 11 కోసం వేచి చూశాను. రత్నవేలుగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రామ్‌లక్ష్మణ్ మాస్టర్స్ యోగుల్లా ఉంటారు. ఈ సినిమాలో వారి యాక్షన్స్ బెస్ట్. శేఖర్ మాస్టర్ బాగా చేశాడు. తమన్నాకి థ్యాంక్స్. రష్మిక చాలా స్వీట్. జనవరి 11న మీకొక కానుక ఇవ్వబోతున్నాం. అది డైరెక్టర్ అనిల్ వల్లే సాధ్యమైంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను’ అన్నారు.