సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు.జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నారు. కాగా ’సరిలేరు నీకెవ్వరు’ మెగాసూపర్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్‌ని విడుదలచేశారు. ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘వారు, వీరు అని లేకుండా అభిమానులు ఇలా కలిసిపోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఐకమత్యం, హెల్దీ వాతావరణం కావాలని నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నాను. మహేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఫంక్షన్ దాన్ని అభిమానులు ప్రూవ్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే అందరి హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. జాతీయస్థాయిలో ఉత్తమనటిగా పేరు తెచ్చుకున్న నా హీరోయిన్ విజయశాంతిగారికి.. మహేశ్‌ని ఎప్పుడూ చూసిన ప్యాషనేట్‌గానే చూస్తాను. తనెంతో ముద్దొచ్చేలా ఉంటాడు. చాలా సరదాగా ఉంటాడు. ఆ మొహంలో చెరగని చిరునవ్వు ఉంటుంది. అయితే ఆ చిరునవ్వు వెనుక చెరగని చిలిపితనం కూడా ఉంటుంది. అలాంటి మహేశ్‌బాబుగారికి.. హీరోయిన్ రష్మిక, మరో హీరోయిన్ తమన్నాకి, సంగీతగారికి ఇతర నటీనటులందరికీ.. ఈ సినిమా ఇంత చక్కగా రూపుదిద్దుకోవడానికి కారణమైన యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడికి.. నిర్మాతలు అనీల్ సుంకర, దిల్‌రాజుకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ మధ్య పేపేరులో మహేశ్ ఫొటో చూశాను. చూడగానే కత్తిలా అనిపించింది. నా చూపును చాలా సేపు అలాగే కట్టిపడేశాడు. మిలటరీ డ్రెస్‌లో మహేశ్‌ను చూడగానే ఈ కత్తికి రెండు వైపులా పదునుందనిపించింది. చూడటానికి చాలా స్మార్ట్‌గా ఉన్నావు. ఈ స్టిల్ చూడగానే సినిమా ఎలా ఉంటుందోనని ఉత్సాహం కలుగుతుందని మహేశ్‌కి మెసేజ్ పెట్టాను. తను రెస్పాండ్ అయ్యాడు. చాలా తక్కువ టైమ్‌లోనే సినిమాను పూర్తి చేసేశారు. నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు అదేంటి అప్పుడే అయిపోయిందా అని అడిగాను. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ యుద్ద ప్రాతిపదికన ఇంత ఫాస్ట్‌గా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంతకన్నా కావాల్సిందేముంది. ఇది కావాలి.. అందరూ ఇలాగే చేయాలి.. అలాంటప్పుడే పరిశ్రమ పది కాలాల పాటు ఉంటుంది. అందరికీ ఉపాధి లభిస్తుంది. బయ్యర్లు సంతోషంగా డబ్బులు సంపాదించుకుంటుంటారు. కానీ డబ్బులు దాచుకోరు. తిరిగి మళ్లీ మనకే ఇస్తుంటారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు మహేశ్ ఒక నయా పైసా కూడా తీసుకోలేదని విన్నాను. దాని వల్ల నిర్మాతలకు ఎంతో లాభం. మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం. అది నిర్మాతలకు ఎంతో కలిసొస్తుంది.
నేను అప్పట్లో అలాగే ఫాలో అయ్యేవాడిని. సినిమా పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకునేవాడిని. ఇప్పుడు చరణ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఈరోజున మహేశ్ ఆరకంగా చేస్తున్నాడంటే.. నిర్మాతకు వెన్నుదన్నుగా నిలబడటం ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇదే విషయాన్ని కొరటాలను అడిగితే మీ సినిమాను కూడా 80-99 రోజుల్లోనే పూర్తి చేస్తానని చెప్పారు. ఇలాంటి రోజులు రావాలి. ఆరోగ్యకరమైన రోజులు సరిలేరు నీకెవ్వరుతో ప్రారంభమైందని అనుకుంటున్నాను. మేం అందరం అలాగే చేస్తాం. దానికి నాంది మహేశ్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. మన సౌతిండియాలో సీనియర్ మోస్ట్ యాక్టర్ కృష్ణగారు. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం దక్కలేదేమో అనిపిస్తుంది. రెండు తెలుగు ప్రభుత్వాలు కలిసి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా గట్టి ప్రయత్నం చేస్తే బావుంటుంది. ఆ పురస్కారం వల్ల కృష్ణగారి కంటే మనకే గౌరవం. 350 సినిమాలే చేయడమే కాదు.. ధైర్య సాహసాలకు ఆయన పెట్టింది పేరు. కొత్త టెక్నాలజీ వస్తే .. దాన్ని ప్రేక్షకులకు అందించడంలో ఆయన ముందుంటారు. హైదరాబాద్‌కి ఇండస్ట్రీ షిఫ్ట్ కావడానికి కారణం., పెద్ద స్టూడియో నిర్మించారు. అలాంటి వ్యక్తి అవార్డుకు అన్ని విధాలా అర్హుడు. ఒకప్పుడు కృష్ణగారి అబ్బాయి మహేశ్.. కానీ ఇప్పుడు మహేశ్ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే మహేశ్ తండ్రి కృష్ణగారు అనే స్థాయికి మహేశ్ వస్తున్నారు. నిజంగా కృష్ణగారు గర్వపడాలి. ప్రతి తండ్రికి అంతకంటే ఏం కావాలంటే. తను సాధించిన తర్వాత తనకు పేరు తెచ్చేలా .. తన కొడుకు పేరు వెనుక తన పేరు రావడం కంటే ఏం కావాలి. అలా తండ్రికి మంచి పేరు తెస్తున్న మహేశ్ ఎంత గర్విస్తాడో నేను ఊహించుకోగలను. ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు. కామెడీ మీద మంచి పట్టున్న డైరెక్టర్ అనిల్ ఈసినిమాలో కామెడీని ఎలా రప్పించాడో మనం ఊహించుకోగలం.
నేను కూడా ఈ సినిమాను ఎప్పుడు చూస్తానా అనే ఉత్సాహం ఉంది. జనవరి 11న సినిమా విడుదల కానుంది. నాకు 10నే సినిమా చూపిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. అనీల్ సుంకరకు సినిమాలంటే ఎంతో ప్యాషన్. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉన్నప్పటికీ మనసంతా సినిమాలు తీయాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఈయనకు దిల్‌రాజు సపోర్ట్ అందిస్తున్నారు. ఆయన చెయ్యేస్తే అది బంగారమే అవుతుంది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నైజాం కింగ్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు, ఈ సినిమాను సూపర్‌హిట్ చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తాడనే నమ్మకం ఉంది. రష్మిక ఈ సినిమాలో చక్కగా చేసిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. తమన్నా కూడా ఈ సినిమాకు అందం తీసుకొచ్చింది. రావు రమేశ్, ప్రకాశ్‌రాజ్‌కి అభినందనలు. 15 ఏళ్ల తర్వాత విజయశాంతి నాకు కనిపించకుండా వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడే కనిపిస్తుంది. తనతో నాకు మంచి ఎమోషన్ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్లం. కలిసి పోతుండేవాళ్లం. ఇద్దరం కలిసి 19-20 సినిమాలు చేశాం. మా మధ్య గ్యాప్ వచ్చింది. రాజకీయాల వల్ల మా మధ్య వచ్చిన గ్యాప్ ఈరోజు తగ్గిపోయింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చింది మాత్రం మహేశే. ఈ మెమురబుల్ ఈవెంట్. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సంక్రాంతికి అల వైకుంఠపురములో, మా స్నేహితుడు రజినికాంత్ ‘దర్బార్’ సహా అన్నీ సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అన్నారు.