ఇదేంటి.. ముగ్గురూ టాప్ హీరోలు కలిసి కొంపదీసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? లేకుంటే ఒకర్నొకరు ఫాలో అవుతున్నారా..? అనేదేగా మీ సందేహం.. అసలు విషయం తెలియాలంటే ఒక్కసారి ‘సరిలేరు నీకెవ్వరు..’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి రావాల్సిందే మరి. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టా్ర్ చిరంజీవి రావడంతో.. మెగాసూపర్ స్టార్ ఈవెంట్‌గా మారిపోయింది. ఇక ఇటు మెగాభిమానులు.. అటు ఘట్టమనేని అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది.
మహేశ్ చిలిపి దొంగ!
ఈ కారక్రమంలో భాగంగా చిరంజీవి ప్రసంగిస్తూ.. మహేశ్ బాబు మొదలుకుని టెక్నిషియన్స్ వరకూ అందర్నీ గుర్తు చేసుకుని అందరికీ ఆల్‌ది వెరీ బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని చెబుతూ.. నిజంగా ఇది చాలా మంచి పని మహేశ్.. అంటూ సూపర్‌స్టార్‌ను ఆకాశానికెత్తేశారు. ‘మహేశ్ ముఖంలో చెరగని చిరునవ్వు ఉంటుంది. అయితే ఆ చిరునవ్వు వెనుక చిన్న చిలిపిదనం ఉంటుంది.. చిలిపి దొంగ. తక్కువ సినిమాలతోనే సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం అనిల్ రావిపూడి దక్కించుకున్నాడు’ అని చిరు చెప్పుకొచ్చారు.
నిజంగా ఇది చాలా మంచి పరిణామం!
‘మహేశ్ బాబు సరిలేరు సినిమా పూర్తయ్యేంతవరకూ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. కనీసం అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. ఇది నిజంగా చాలా మంచి పరిణామం. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు ఎన్నో కోట్ల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది. నేను కూడా చిత్రం తర్వాతే తీసుకునేవాడ్ని.. నా కుమారుడు రామ్ చరణ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు అనుసరిస్తున్న పంథా నిర్మాతలకు చాలా ఊరట కలిగిస్తుంది. రెండంకెల వడ్డీకి బదులు ఒక్క అంకెతోనే నిర్మాతలు బయటపడతారు నిర్మాతలు. నిజంగా అడ్వాన్స్ తీసుకోకపోవడం అనేది చాలా మంచి పరిణామం’ అని మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. కాగా.. చిరు మాట్లాడుతున్నంత సేపు అటు మెగాభిమానులు.. ఇటు ఘట్టమనేని అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు.