విజయ్ దేవరకొండకి తన మీద తన యాటిట్యూడ్ మీద అపారమైన నమ్మకం. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కి స్పెషల్ ఫ్యాన్స్ వచ్చేసేసరికి విజయ్ కి కూడా కాస్త ఎక్కేసింది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్ తో బాగా ఎక్కువైన విజయ్ దేవరకొండకి ఎంతమంది ఫ్యాన్స్ అయితే వచ్చారో.. అంతమంది శత్రువులు తయారయ్యారు. విజయ్ దేవరకొండ దొరక్కపోతాడా ఎక్కడైనా నొక్కకపోతామా అని కాచుకుని కూర్చున్న వారికి డియర్ కామ్రేడ్ విషయంలో విజయ్ కాన్ఫిడెంట్ ని దెబ్బతీసేలా చేసారు. ఆ సినిమాతో నిజంగానే విజయ్ కి చుక్కలు కనబడ్డాయి.
ఇక తాజాగా విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో పెరిగిపోవడంతో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా విజయ్ మీద కాస్త ఈర్ష్య పడడం మొదలెట్టారు. ఇక డియర్ కామ్రేడ్ పోయాక వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వస్తున్న విజయ్ దేవరకొండకి ఆ సినిమా ఫస్ట్ లుక్ నుండే కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి విజయ్ బయటికి రాలేకపోతున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ లుక్ మొత్తం అర్జున్ రెడ్డి స్టయిల్లోనే ఉంది. కొత్తగా ఏముందిలే అంటున్నారు. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజర్ విడుదలైందో లేదో.. విజయ్ యూత్ ని పడెయ్యడానికి అర్జున్ రెడ్డి స్టయిల్ ని మరోసారి ఫాలో అయ్యాడని, లిప్ లాక్స్ పెడితే యూత్ కనెక్ట్ అవుతారని, అందుకే ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ మీదే ఆధారపడుతున్నాడని, ఇంకా బోల్డ్ గా నటిస్తేనే యూత్ ఎట్రాక్ట్ అవుతారనే ధీమాతో వరల్డ్ ఫేమస్ లవర్ ని బోల్డ్ మూవీగా మార్చేసాడని అంటున్నారు.
వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాపై యాంటీ ఫాన్స్ పనిగట్టుకుని ఈ రకమైన ట్రోల్స్ చేస్తున్నారన్నమాటే గాని.. నిజంగానే వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండ కేరెక్టర్, యాటిట్యూడ్, స్టయిల్ అన్నిటా అర్జున్ రెడ్డి సినిమా పోలికలే కనిపిస్తున్నాయి. ఒక్క సింగరేణి కార్మికుడి లుక్ తప్పితే. మరి అర్జున్ రెడ్డి మూస నుండి విజయ్ ఎప్పటికి బయటపడతాడో చూద్దాం.