కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘దర్బార్’ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది - సూపర్ స్టార్ రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఆదిత్య అరుణాచలంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి జనవరి 9న తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ - ‘‘చాలా రోజులుగా మేం తమిళంలో ఓ సినిమాను చేయాలని అనుకుంటున్న తరుణంలో రజినీకాంత్ గారితో సినిమా చేసే అవకాశం రావడం చాలా గొప్పగా అనిపించింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మురుగదాస్ గారికి థ్యాంక్స్. సమాజం పట్ల బాధ్యతతో మంచి మెసేజ్‌తో సినిమాలు చేసే దర్శకుడాయన. రజినీకాంత్ గారితో చేసిన ఈ జర్నీ ఎప్పటికీ మరచిపోలేం’’ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ‘‘రజినీకాంత్‌గారిలోని కసి, జర్నీ చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. మా జనరేషన్స్‌లో ఎందరికో ఆయన ఇన్‌స్పిరేషన్. మురుగదాస్‌గారి వర్కింగ్ స్టైల్ ఎంతగానో నచ్చుతుంది. ఆయనతో కలిసి రజినీగారు సినిమా చేయాలని చాలా రోజులుగా అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికీ కుదిరింది. అనిరుధ్, సంతోశ్ శివన్ గారు, నివేదా, రామ్ లక్ష్మణ్ సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. ఇలాంటి గొప్ప సినిమాలు చేస్తున్న నిర్మాత సుభాస్కరన్ గారికి థ్యాంక్స్’’ అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ‘‘ట్రైలర్, సాంగ్స్ మామూలుగా లేవు. రజినీకాంత్‌గారు మళ్లీ రిటర్న్ బ్యాక్ అన్నట్లుగా ఉంది. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘ట్రైలర్‌లో రజినీకాంత్‌గారు నడుచుకుంటూ వస్తున్న సీన్ చూసి ఫిదా అయిపోయాను. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురుగదాస్ గారైతే ఇటు తెలుగు, అటు తమిళం, హిందీ ఏ భాషైనా ఇరగదీసేస్తున్నారు. జనవరి 9న విడుదలవుతున్న సినిమా సూపర్‌హిట్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది’’ అన్నారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ - ‘‘నేను ఇక్కడికి పెద్ద ఫ్యాన్‌ని. ఇంత పెద్ద రేంజ్‌లో మీడియా వచ్చిన తర్వాత మనం రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ అవేవీ లేనప్పుడే భాషా, ముత్తు, నరసింహ, రోబో వంటి చిత్రాలతో అన్ని రికార్డులు బద్దలు కొట్టేశారు. తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఏ లాంగ్వేజ్‌లో ఆయన్ని చూసినా ఆయన మనోడు అని భావిస్తారు. ఆయన సౌతిండియా సూపర్‌స్టారే కాదు.. ఇండియన్ సూపర్‌స్టార్. అలాగే మురగదాస్‌గారు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సామాజిక బాధ్యత ఉన్న సినిమాలు చేస్తుంటారు. అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన నాతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘హేమాహేమీలందరూ కలిసి చేసిన ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది’’ అన్నారు.
నివేదా థామస్ మాట్లాడుతూ - ‘‘రజినీ సార్‌లోని ఎనర్జీ ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద మూవీలో నాకు అవకాశం ఇచ్చిన మురుగదాస్ గారికి థ్యాంక్స్. మంచి సినిమాలను ఎంకరేజ్ చేసే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్మకం ఉంది’’ అన్నారు.
సంతోశ్ శివన్ మాట్లాడుతూ - ‘‘దళపతి సినిమాలో నేను రజినీకాంత్ గారితో కలిసి పనిచేశాను. చాలా సంవత్సరాలు తర్వాత ఆయనతో కలిసి దర్బార్ సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు’’ అన్నారు.
సునీల్ శెట్టి మాట్లాడుతూ - ‘‘దర్బార్ టీమ్ నేను పనిచేసిన బెస్ట్ టీమ్స్‌లో ఒకటి. రజినీకాంత్‌గారు, సంతోష్ శివన్‌గారు, మురుగదాస్‌గారు, అనిరుధ్.. వీరందరినీ కలిపిన నిర్మాత సుభాస్కరన్ గారికి థ్యాంక్స్. రజినీకాంత్ గారిని అందరూ సూపర్‌స్టార్ అని అంటాం కానీ.. ఆయన్ని అందరూ గాడ్ ఆఫ్ సినిమా అంటాను. ఆయన్ని చూసి మేం చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంత పెద్ద పేరు వచ్చినా కూల్‌గా ఉండటం ఆయన్ని చూసే నేర్చుకోవాలి’’ అన్నారు.
డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్‌లోనే దర్బార్ చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే నేను 13 సినిమాలు చేసినప్పటికీ రజినీకాంత్ గారితో కలిసి చేసిన తొలి సినిమా ఇది. నేను డైరెక్ట్ చేసిన తొలి పోలీస్ స్టోరీ. అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా చాలా బాగా వచ్చింది. జనవరి 9న సినిమా విడుదలవుతుంది. పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి నిర్మాత కావాలి. ఆయనే సుభాస్కరన్ గారు. ఆయన నిజ జీవితంలోనే హీరో. ఆయన జీవితంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో సుభాస్కరన్ గారిపై కూడా బయోపిక్ చేయవచ్చు. నయనతార, నివేదా థామస్ చక్కగా నటించారు. రామ్‌లక్ష్మణ్ మాస్టర్స్‌కి థ్యాంక్స్. చాలా కొత్తగా ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. 15 ఏళ్ల క్రితం రజనీకాంత్ గారిని ఎలా చూశారో అదే స్పీడు, మాస్, స్టైల్ ఉన్న చిత్రమిది. అనిరుధ్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్.ఆర్ ఇంకా అద్భుతంగా ఇచ్చాడు. సునీల్ శెట్టిగారు రజినీకాంత్ గారిని బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని పండించారు. ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్’’ అన్నారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ - ‘‘నాకు 70 ఏళ్లు అవుతుంది. ఇంకా నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాన్నంటే కారణం ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, ప్రోత్సాహమే కారణం. ఇంత వయసులోనూ ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కొంత మంది అడుగుతుంటారు. తక్కువగా ఆశపడండి. తక్కువగా బాధపడండి.. తక్కువగా భోజనం చేయండి.. తక్కువగా నిద్ర పోండి.. తక్కువగా ఎక్సర్‌సైజ్ చేయండి, తక్కువగా మాట్లాడండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం. 1976 తెలుగులో అంతులేని కథ విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎలా ప్రేమిస్తారో అదే ప్రేమను తెలుగు ప్రేక్షకులు ఇవ్వడం నా భాగ్యంగా, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. తెలుగు ప్రేక్షకులు సినీ ప్రేమికులు. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారు. నేను చేసిన భాషా, ముత్తు, పెదరాయుడు, నరసింహ, చంద్రముఖి, రోబో కేవలం నాకోసమే ఆడలేదు. మంచి సినిమాలు. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. అందరూ సినిమా బాగా హిట్ కావాలనే చేస్తారు. అయితే సినిమా చేసే సమయంలో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ మన చేతుల్లో ఉండదు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జరిగింది. మురుగదాస్ గారితో పనిచేయాలని 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది. సుభాస్కరన్‌గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాలంటే ప్యాషన్ ఉన్న నిర్మాత. ఇప్పుడు కూడా బాహుబలిలాంటి సినిమా పొన్నియన్ సెల్వన్‌ను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశాను. ఈ కథను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగదాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది. కెమెరామెన్ సంతోశ్ శివన్, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాకు వెయిట్ పెంచారు. రామ్ లక్ష్మణ్‌గారు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. తిరుపతి ప్రసాద్‌గారు తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. దర్బార్ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. 168 సినిమాలు చేశాను. ఈ సినిమా డిఫరెంట్ మూవీ. దర్బార్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. సునీల్ శెట్టి సహా అందరూ చక్కగా నటించారు. అందరూ బావుండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: సురేంద్ర నాయుడు- ఫణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మ్యూజిక్: అనిరుద్ రవి చంద్రన్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్.