యువ కథానాయకుడు తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకులు జాని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. భానుశ్రీ మెహ్రా, రిషిక ఖన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మహాప్రస్థానం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో నాయకా నాయికలతో పాటు రాజా రవీంద్ర, అమిత్, గగన్ విహారి తదితర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రోగ్రెస్ ను చిత్రబృందం వివరించారు.
దర్శకులు జాని మాట్లాడుతూ.. తనీష్ గారు సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకరించడం వల్ల శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాం. అనుకున్నది చేయగలుగుతున్నాం. మా సినిమాలో దాదాపు అన్నీ నెగిటివ్ క్యారెక్టర్ లే ఉంటాయి. రెండు మూడు మంచి పాత్రలుంటాయి. అందరూ విలన్ కు సంబంధించిన గ్యాంగ్ ఉంటారు. హీరో సహా ఉన్నవాళ్లంతా క్రిమినల్సే. కొంతమంది క్రిమినల్స్ మధ్య జరిగే ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీ ఇది. సినిమా చాలా బాగా వస్తోంది. మహాప్రస్థానం టైటిల్ కు న్యాయం చేస్తున్నామనే అనుకుంటున్నాం. హీరో క్యారెక్టర్ చేసే జీవిత ప్రయాణాన్ని చూపిస్తాం కాబట్టే మహాప్రస్థానం అని టైటిల్ పెట్టాం. కానీ ఇందులో శ్రీ శ్రీ భావజాలం కనిపించదు. అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ.. మా సినిమా షూటింగ్ అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోంది. దర్శకులు జాని కథను ఎలా డిజైన్ చేసి చెప్పారో అలాగే సినిమా తీస్తున్నారు. ఒక యజ్నంలా రాత్రీ పగలూ షూటింగ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమా ఇంత త్వరగా తెరకెక్కించడం కష్టం. అంకితభావంతో చేయకుంటే ఈ కథకు న్యాయం చేయలేం. దీన్నొక సవాలుగా తీసుకున్నాం. రేపు సినిమా చూశాక మీరే చెప్తారు. ప్రతి షాట్ రిహార్సల్ చేస్తూ నటిస్తున్నాం. రెండు వారాల్లో దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నాం. ఇది యాక్షన్ నేపథ్యంలో జరిగే కథ. చాలా కొత్తగా, ఇండియన్ స్క్రీన్ మీద ఓ ప్రయోగంలా ఉంటుంది. ఎక్కడా విసిగించదు. ఇవాళ మన సమాజంలో జరిగే ఘటనలను వాస్తవికంగా చూపిస్తూ సాగుతుంది. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే గొప్ప అర్థాన్ని చెప్పే కథ ఇది. అన్నారు.
నాయిక భానుశ్రీ మెహ్రా మాట్లాడుతూ... చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నాను. ఇటీవలే నాకు పెళ్లయింది. అందుకే చిన్న విరామం తీసుకున్నా. మహాప్రస్థానం చిత్రంలో పాత్రికేయురాలి పాత్రలో కనిపిస్తాను. ఇది చాలా కీలకమైన పాత్ర. అన్నారు.
నాయిక ముస్కాన్ సేథీ మాట్లాడుతూ.. మహాప్రస్థానంలో నాయికగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక ఆసక్తికరమైన కథ. డిఫరెంట్ మెథడాలజీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నేను తొలిసారి ఇలాంటి షూటింగ్ లో భాగమవుతున్నాను. అమేజింగ్ యాక్షన్, పైట్స్, కొద్దిగా గ్లామర్ ఉంటాయి. అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర, అమిత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం, సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - బాల్ రెడ్డి, కథా కథనం దర్శకత్వం - జాని.