ధనుష్, మేఘ ఆకాష్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ డైరెక్షన్‌లో తెరకెక్కికిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తూటా’. న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ విడులైంది. రొమాంటిక్ కథలను తయారు చేయడంలో గౌతమ్ మీనన్ దిట్ట అని ఇప్పటికే పలుమార్లు తన చిత్రాలతో నిరూపించుకున్నాడు. అయితే కొత్తగా థ్రిల్లర్ కమ్ రొమాంటిక్ కథను తెరకెక్కించి తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టాడు. న్యూయర్ నాడు వచ్చిన ఈ చిత్రంపై పబ్లిక్ ఏమంటున్నారు..? ఏ మాత్రం సినిమాను సినీ ప్రియులు ఆదరిస్తున్నారు..? అసలు ‘తూటా’ తెరపై పేలిందా.. లేదా? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెరైటీగానే ఆలోచించాడుగా!
సినిమాలోని కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. మరికొన్ని మాత్రం ఈ సీన్లు లేకుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తోంది. వాస్తవానికి.. ప్రతి సినిమాలో అమ్మాయి.. చుట్టూ అబ్బాయి తిరిగి తిరిగి చివరికి ఐ లవ్ యూ చెప్పడం కామన్ పాయింటే.! అయితే గౌతమ్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా సింగిల్ లుక్‌లోనే హీరోకు హీరోయిన్ పడేలా.. అది కూడా ఎలాంటి పరిచయం లేకుండానే ప్రేమలో పడటం అంటే కాస్త వెరైటీగానే ఆలోచించాడు. హీరో ధనుష్ గురించి గట్టిగానే చూపించిన డైరెక్టర్.. అసలు హీరోయిన్ ఎవరు..? అనే విషయమై కాస్త ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే సినిమాలో విలన్.. కుమార్ పాత్ర కాస్త గజిబిజిగా ఉంది. ఆయన్ను ఒకసారి బాగా చూపించడం మరోసారి ఇంకోలా చూపించడాన్ని బట్టి చూస్తే ఎందుకో డైరెక్టర్ కన్ఫూజ్ అయ్యాడని అర్థమవుతోంది.
సస్పెన్స్ సరే.. లాస్ట్ దాకా ఏదీ!
మరీ ముఖ్యంగా.. హీరో అన్న గురుమూర్తి పాత్రధారుడు శశికుమార్ పాత్రను మొదటి పార్ట్‌లో సస్పెన్స్‌తో సినిమాపై బాగా ఇంట్రెస్ట్ పెంచాడు.. అంతేకాదు ట్విస్ట్‌ల ట్విస్ట్ ఇచ్చాడు కానీ.. అదే ఇంట్రెస్ట్ చివరి దాకా కంటిన్యూ చేయలేకపోయాడు. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దినప్పటికీ.. చివర్లో పసలేకుండా ముగించేశాడు. గురుమూర్తి అసలు హీరోయిన్‌కు ముంబైలో ఎలా పరిచయం అవుతాడనేది ఇంకాస్త క్లారిటీగా చూపించాల్సింది. ఇదిలా ఉంటే.. అంత కష్టపడి గురు అండర్ కవర్‌లో ఆపరేషన్ పూర్తి చేస్తే దాన్ని సింపుల్ మూడు ముక్కల్లో తేల్చేయడంతో ఇదే సినిమాకు మైనస్ పాయింట్‌గా మారింది. ఇక్కడ కాస్త ఒకటికి పదిసార్లు ఆలోచించి తెరకెక్కించి ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో.!.
మిగతావన్నీ బాగున్నాయ్!
సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్ అనిపించింది. రెండు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయ్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది కానీ క్లైమాక్స్ మాత్రం గందరగోళంగా ఉంది. యాక్షన్ సీన్స్‌లో ధనుష్ దుమ్ములేపి దమ్మేంటో చూపించాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే సినిమా ఎంతసేపు సీరియస్.. రొమాంటిక్ యాంగిల్‌ను మాత్రమే టచ్ చేసిన డైరెక్టర్.. కామెడీ ఊసే లేకుండా చేయడం పెద్ద మైనస్ పాయింట్. అంతేకాదు.. ఆశించినన్నీ డైలాగ్స్ కూడా లేకపోవడం సినీ ప్రియులను అసంతృప్తికి గురిచేసినట్లయ్యింది. ఇక నటీనటులు వారివారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్నీ బాగున్నాయ్. ఇప్పటికే సక్సెస్‌ఫుల్ థియేటర్లలరో రాణిస్తున్న ‘తూటా’.. ఇంకెంత దూరం వెళ్తుందో.. ఏ మాత్రం కలెక్షన్లు రాబడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.