మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ మాటకు చిరంజీవి తీవ్ర ఆగ్రహానికి లోనై.. ‘మంచి అయితే మైకులో చెప్పండి.. చెడు అయితే చెవిలో చెప్పండి’ అని ఒకింత హెచ్చరించేలా మాట్లాడారు. ఇలా ఒకరిపై ఒకరు కోపతాపాలతో ఈ వివాదం కాస్త రాజశేఖర్ రాజీనామా దాకా వెళ్లింది. రాజీనామా చేస్తున్నట్లు లేఖ ద్వారా ప్రకటించి.. అనంతరం ట్విట్టర్ వేదికగా పెద్దలు చిరంజీవి, మోహన్ బాబుకు ఆయన క్షమాపణలు చెప్పారు. మాలో జరిగిన ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
గతంలో కూడా ఇలాగే..!
మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు గనుక తప్పకుండా సమస్య పరిష్కారమవుతుందన్నారు. రాజశేఖర్ తన ఆవేశాన్ని ఆపులేకపోయారని.. ఆధిపత్య పోరులో భాగంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా.. గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయని.. అయితే క్రమ శిక్షణ కమిటీ గతంలోనూ చాలాసార్లు చాలామందిపై చర్యలు తీసుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తమ్మారెడ్డి గుర్తు చేశారు. తాజాగా నెలకొన్న సమస్యలను మళ్లీ మళ్లీ జరగకుండా చిరంజీవి కృషిచేస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
చిరుకు పూర్తి కోపమొస్తే..!
వాస్తవానికి ఇవాళ జరిగిన సమావేశంలో చిరులో సగం కోపం మాత్రమే చూశామని.. ఆయనకు పూర్తి కోపమొస్తే కచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయని తమ్మారెడ్డి తెలిపారు. గతంలో ఇలాంటి సమస్యలను దివంగత దాసరి నారాయణరావు పరిష్కరించేవారన్నారు. ఆయన మరణాంతరం ఆ బాధ్యతలు నిర్వర్తించే వారెవ్వరూ లేరని.. మెగాస్టార్ చిరంజీవే ఆ స్థాన్ని భర్తీ చేస్తారని తమ్మారెడ్డి తెలిపారు. కాగా ఇప్పటికే పలుమార్లు దాసరి స్థానాన్ని చిరు తీసుకోవాలని.. ఇండస్ట్రీకి పెద్దన్నగా.. సమస్యలు పరిష్కరించాలని మీడియా వేదికగా.. పలు ఇంటర్వ్యూ్ల్లో తమ్మారెడ్డి చెప్పిన విషయం విదితమే.