మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో నెలకొన్న గొడవల నేపథ్యంలో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఉదయం జరిగిన గొడవపై చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అని.. వీరిద్దరికీ ఎప్పుడూ గొడవలే ఉంటాయని.. ఇప్పట్లో ఈ వివాదాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడదని మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై రాజీనామా చేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా మరోసారి రాజశేఖర్ స్పందించారు.
మాకు గొడవల్లేవ్.. సారీ చిరు!
‘ఇవాళ గొడవ జరిగింది.. నాకు - నరేష్‌కు మాత్రమే. అయితే నాకు-చిరంజీవి, మోహన్ బాబుకు ఎలాంటికి గొడవల్లేవ్. గొడవలున్నాయని వస్తున్న వార్తలన్నీ పుకార్లే.. మా మధ్య ఎలాంటి గొడవల్లేవు. ‘మా’లో ఏ ఒక్క పనీ సరిగ్గా జరడం లేదు.. అందుకే నేను మాట్లాడకుండానే వెళ్లిపోయాను. అందుకే రాజీనామా కూడా చేశాను. దయచేసి ఇవాళ జరిగిన గొడవను పెద్దదిగా చేసి చూపించకండి. ముఖ్యంగా చిరు-మోహన్ బాబు.. నాకు మధ్య గొడవగా దీన్ని సృష్టించొద్దు. చిరంజీవి గారికి క్షమాపణలు చెబుతున్నాను. చిరు, మోహన్ బాబు అంటే నాకు అమితమైన గౌరవం ఉంది. ‘మా’కు వారిద్దరి సేవలు అవసరం. ఇకపై ఇండస్ట్రీకి ఏ సాయం చేయాలనుకున్నా.. నేనొక్కడినే చేస్తాను. ఎలాంటి సాయం అయినా చేస్తాను. దయచేసి ఇవాళ జరిగిన గొడవను మరోలా అర్థం చేసుకోకండి’ అని ట్విట్టర్‌లో రాజశేఖర్ వరుస ట్వీట్స్ చేశారు.
కాగా.. రాజశేఖర్ రాజీనామా చేశారు సరే దాన్ని ‘మా’ సభ్యులు, అధ్యక్షుడు ఆమోదిస్తారా లేదా అన్నది తెలియరాలేదు. అసలు ఈ రాజీనామాపై ‘మా’ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మొత్తానికి చూస్తే.. యాంగ్రీ స్టార్ ట్వీట్స్‌ను బట్టి చూస్తే ఆయన కోపమంతా నరేష్ పైనే అన్న మాట. చిరుతో ఎలాంటి గొడవల్లేవని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రాజశేఖర్‌పై పీకల్లోతు కోపంలో ఉన్న చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.