మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో వీరి మధ్య గొడవలు జరగడం.. మళ్లీ కలిసిపోవడం షరామామూలుగా మారింది. అయితే ఇవాళ మాత్రం ఒకరినొకరు తిట్టేసుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి సీరియస్ అవ్వడం.. మరోవైపు యాంగ్రీ స్టార్ కూడా ఆగ్రహంతో రగిలిపోవడం.. మధ్యలో పెద్దలు కలుగజేసుకోవడంతో కాసింత వివాదం సద్దుమణిగింది. అయితే సభ మధ్యలో నుంచి బయటికెళ్లిపోయిన రాజశేఖర్.. కొన్ని గంటల వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ‘మా’ పెద్దలకు యాంగ్రీస్టార్ లేఖ రాయడం జరిగింది. మా అధ్యక్షుడు నరేశ్ వైఖరి తీవ్ర మనస్తాపం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. ఆయన తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు రాజశేఖర్ ప్రకటించారు. రాజశేఖర్ నిర్ణయంతో ఇండస్ట్రీ పెద్దలు కొందరు హ్యాపీగా ఫీలవుతుండగా.. మరికొందరు మాత్రం ఇదేంటి ఇంత సడన్‌గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అని అంటున్నారు.
చిరు ఎఫెక్ట్‌తోనే రాజీనామా..!
వాస్తవానికి ఈ గొడవ జరిగినప్పుడు మెగాస్టార్ మాట్లాడుతూ.. ఈ ఘటన మొత్తం ముందుగా పక్కా ప్రణాళిక వేసుకుని వచ్చి రచ్చ చేయడం జరిగిందన్నారు. ‘మా’ లోని క్రమశిక్షణా కమిటీని స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చిరు కోరారు. అయితే చర్యలు తీసుకోవడమేంటి..? తనకు తానుగా తప్పుకుంటే మంచిదని రాజశేఖర్ భావించారేమోగానీ ఆయనే రాజీనామా చేసేశారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే.. డైరీ ఆవిష్కరణలో జరిగిన రచ్చపై రాజశేఖర్ తరఫున సారీ చెప్పిన జీవిత.. రాజీనామాపై ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి.