ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కి కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రశంసలు!!
మంగళ హృదయంతో చేసే ప్రతి భగవత్కార్యం విజయం సాధించి జైత్రయాత్రలో ప్రయాణిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత, శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప మంత్ర విశేషగ్రంథం ‘అమృతధారలు’ ఆదివారం ఉదయం త్యాగరాయ గాన సభలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న అపూర్వ రచనా, ప్రచురణల ఆధ్యాత్మిక భావజాల కృషి అప్రతిహతంగా సాగుతూ దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుండటం తిరుమల శ్రీవారి అనుగ్రహమేనని చెప్పారు. పరమ రహస్యమైన పరమాత్మ పరతత్యాలను తెలుగులో ఘనాఘనంగా అందించడంలో పురాణపండ శ్రీనివాస్ విలక్షణత చాలా ఆకర్షణీయంగా ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వీఎస్.జనార్దన్ మూర్తి మాట్లాడుతూ తెలుగు నాట భక్తి ప్రచురనలు, రచనలలో పవిత్ర సొగసును ప్రదర్శించే పురాణపండ శ్రీనివాస్ నిస్వార్థతను అభినందించారు. అమృతధార తొలి ప్రతిని విఖ్యాత చారిత్రక నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆకృతి సుధాకర్, వైఎస్.రామకృష్ణ, కె.రామచంద్రమూర్తి, నగర ప్రముఖులు బండి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.