టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. పవన్ రేంజ్ ఏంటో యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజానికానికి తెలుసు. ఎందుకంటే ఈయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు.. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు గనుక. అయితే సినిమాల్లో పవర్‌స్టార్‌గా నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న పవన్.. రాజకీయాల్లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క చోట కాదు రెండు చోట్ల పోటీచేసినప్పటికీ ఒక్కస్థానంలో కూడా గెలవలేకపోవడం.. అసలెందుకిలా జరిగిందనేది పవన్‌కు.. ఆయన వీరాభిమానులకు ఇప్పటికీ తెలియని విషయం. అయితే రాజకీయంగా ప్లాప్ అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మాత్రం తనవంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నారు.
పవన్‌కు ప్రత్యేక సంచిక..!
ఈ క్రమంలో అసలు పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఏం సాధించారు..? తన వద్దకు వచ్చిన ప్రజా సమస్యలకు ఏ మాత్రం పరిష్కారం చూపించారు..? ప్రభుత్వంపై చేసిన పోరాటాలేంటి.. సాధించిందేంటి? అనే విషయాలను ఓ సంచిక రూపంలో పొందుపరిచి 99 టీవీకు చెందిన మ్యాగజైన్ ప్రత్యేక సంచికగా ‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే!’ అనే శీర్షికతో విడుదల చేయడం జరిగింది.
‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడే.. పవన్!!
ఇందులో ఉద్దానం సమస్యలపై పోరాటం, రాజధాని రైతులకు తోడుగా.. తుఫాన్ బాధితులకు అండగా నిలిచిన విషయాలను నిశితంగా వివరించారు. అంతేకాదు పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సాధించిన ఉద్దాన సమస్యను కూడా రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుల కోసం పవన్ చేసిన పోరాటం, భనవ కార్మికులకు తోడుగా పవన్ నిలవడం.. ఇలాంటి ఎన్నో విషయాలను మొత్తం మూడు పేజీల్లో పొందుపరిచి విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రత్యేక సంచిక నెట్టింట్లో బాగా వైరల్ అవుతుండగా.. ఇది చదివిన మెగాభిమానులు, పవన్ ఫ్యాన్స్ మురిసిపోతూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. అంతే రీతిలో ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయ్. వైసీపీ ఫ్యాన్స్ ఓ వైపు విమర్శల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేస్తుండగా.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే అనేది మా హీరో మహేశ్ నటించిన ‘అతడు’ చిత్రంలోనిదని.. అది కూడా వాడేస్తే ఎలా ‘డబ్బా రాయుడా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే పవన్ వీరాభిమానులకు 99న్యూస్.. 2019 గిఫ్ట్‌గా ఈ ప్రత్యేక సంచికను ఇచ్చిందని చెప్పుకోవచ్చు.