అవును.. మీరు వింటున్నది నిజమే.. అల్లు అరవింద్ ఆ మాట అన్నప్పుడల్లా ఆయన ముగ్గురు కుమారులు జంకుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అసలు అరవింద్ ఏమంటున్నారు..? ఆయన కుమారులు ఎందుకు భయపడుతున్నారు..? భయపడేంతగా అల్లు అరవింద్ ఏం చెబుతున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో అల్లు అరవింద్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గీతా ఆర్ట్స్ అధినేతగా, నిర్మాతగా ఆయన ఎన్నో విజయాలను అందుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కేలేదు.. అలా విజయవంతంగా రాణిస్తున్న ఆయన.. గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌పై కూడా సినిమాలను గట్టిగానే చేస్తూ.. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నింటీనీ బన్నీ వాసుకి అప్పగించారు అల్లు అరవింద్. వాస్తవానికి అల్లు అరవింద్‌కు బన్నీవాసు నమ్మినబంటగా ఉంటూ వస్తున్నారు. అలా తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న బన్నీవాసుకే బాధ్యతలు అప్పగించారు అల్లు అరవింద్. అల్లు అరవింద్‌కు ముగ్గురు కుమారులు.. బన్నీ వాసు కూడా కుమారుడిలాగే అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అందుకే బన్నీ వాసును అల్లు అరవింద్ నాలుగో కుమారుడిగా భావిస్తుంటాడు!
అయితే ఇటీవల ‘ప్రతిరోజూ పండగే’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ బన్నీ వాసును ఆకాశానికెత్తేశాడు. ‘బన్నీ వాసు అంటే నాకు చాలా ఇష్టం. అతను నా కొడుకులాంటివాడే. ఇతనితో కలిసి నాకు నలుగురు కొడుకులు. బన్నీవాసు నా నాలుగో కొడుకు అన్నప్పుడల్లా.. అతనికి కూడా ఆస్తులు రాసిస్తానేమోనని నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు’ అని చమత్కరిస్తూ మాట్లాడారు. అల్లు అరవింద్ చమత్కారం ఎక్కువనేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అరవింద్ ఆస్తుల్ని పంపకాలు చేసేశారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యామిలీలో మరోసారి చర్చనీయాంశమైంది.