ఎవరేమనుకున్నా నాకేంటి.. నేను నా వివాదాలు అంతే.. అంటూ పొద్దున నిద్రలేచింది మొదలుకుని.. మళ్లీ నిద్రపోయే వరకూ వివాదాలే అన్నం, ఆరగింపులాగా గడుపుతున్న వారిలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ఒకరన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్దగా సోషల్ మీడియా జోలికి పోకుండా తన పనేంటో తాను చేసుకుంటూ పోతున్న కత్తి.. గత రెండు మూడు నెలలుగా మళ్లీ రంగంలోకి దిగాడు. అబ్బే.. మనం సైలెంట్‌గా ఉంటే మన స్థానం ఎవడైనా ఆక్రమిస్తాడు అని అనుకున్నాడో ఏమోగానీ.. సోషల్ మీడియాలో మళ్లీ హడావుడి ప్రారంభించాడు.
ఈ మధ్య మెగా ఫ్యామిలీపై పడ్డ కత్తి.. మెగా బ్రదర్ నాగబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా.. చిన్న చితగా ఎందుకులే అనుకున్నాడేమో గానీ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కంగనా రనౌత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఆమెకు ఎవరైనా చెప్పండ్రా..’ అంటూ తన ఫేస్‌బుక్‌లో కంగానాను ఉద్దేశించి రాసుకొచ్చాడు. ‘ఈ పిల్లకి ఎవరైనా చెప్పండ్రా.. ఇన్‌డైరెక్ట్ టాక్స్ అనేది ఒకటి ఉంటుందని. దేశంలో పేదవాడు కూడా కొనే ప్రతి వస్తువు మీదా టాక్స్ కడతాడని..’ అని కామెంట్ చేస్తూ కంగనా ఫొటోను కత్తి షేర్ చేశాడు. కత్తి కామెంట్స్‌పై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తు్న్నాయ్. వీరిలో కొందరు కత్తి కామెంట్స్‌ను స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం ‘నువ్ మారవా.. ఎప్పుడూ మాకు ఈ గోలేంటి..?’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
అసలేం జరిగింది.. కంగనా ఏమన్నది!?
ఇటీవల కంగనా నటించిన ‘పంగా’ ట్రైలర్ లాంచ్‌లో ఆ బ్యూటీ పాల్గొంది. ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్న అల్లర్ల గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఎవరైనా ఓ విషయానికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నప్పుడు అది ఘర్షణలకు దారి తీసేలా ఉండకూడదని.. మన దేశంలో కేవలం మూడు నుంచి నాలుగు శాతం మందే టాక్స్‌లు కడుతున్నారని వ్యాఖ్యానించింది. అయితే మిగతావారంతా పన్నులు కట్టేవారిపై ఆధారపడి బతుకుతున్నారని.. అలాంటప్పుడు బస్సులు, రైళ్లు వంటి ప్రభుత్వ ప్రాపర్టీలను ధ్వంసం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అని కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసింది. అయితే కంగనా చేసిన వ్యాఖ్యలు కాస్త సబబే అనిపించినప్పటికీ విమర్శపాలవ్వక తప్పలేదు. ఇదిలా ఉంటే.. కంగానపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అస్సలు ఊరుకోని సోదరి రంగోలీ చందేల్.. కత్తి కామెంట్స్‌పై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.