అది ‘అల వైకుంఠపురం..’ కాదు... విజయవాడ మహానగరం. పైగా అది రాజకీయాల రాజధాని. అక్కడంతా ‘సరిలేరు నాకెవ్వరూ’ అనుకునేవారే. అలాంటి రాజధాని కంట్లో ‘రంగా’ అనే నలుసు పడింది. నలిపేయడానికి అది సాధ్యమయ్యేది కాదు. కన్ను వాచిపోవడం తప్ప అదెక్కడికీ పోదు. పక్కలో బల్లెంలా తయారయ్యే సరికి శత్రువులూ ఎక్కువయ్యారు. రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు భయపడే రకం కాదు రంగా. అక్కడి రాజకీయానికి బలుపు ఎక్కువయ్యింది... మలుపులూ ఎక్కువయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం, మరో పక్క తెలుగుదేశంలో ప్రత్యర్థి ‘దేవినేని’ చాణక్యం. ఆ పద్మ వ్యూహ్యంలో అభిమన్యుడే అయ్యాడు ‘రంగా’. ఆ రోజే డిసెంబర్ 26. అక్కడి రౌడీయిజంలో ‘రంగా’ అనే నిజం లేకుండా పోయింది.
అసలు రంగా ఎవరు? ఈ దేవినేని ఎవరు? ఈ ఇద్దరూ ప్రత్యర్థులా? మిత్రులా? వీరి మధ్య ఏం జరిగింది. అది తెలుసుకోవాలంటే ‘దేవినేని’ చూడాల్సిందే.. ఇందులో దేవినేనిగా నందమూరి తారకరత్న, రంగాగా సురేష్ కొండేటి నటిస్తున్నారు. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రామూరాథోడ్, జి.ఎస్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను అమలాపురంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో సినిమా మొత్తం పూర్తవుతుంది.
చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ఈ డిసెంబర్ 26 రంగా వర్ధంతి. మా సినిమా చిత్రీకరణ కూడా ఈరోజే మొదలైంది. రేపటితో పూర్తవుతుంది. ముఖ్యంగా రంగా పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. సురేష్ కొండేటిని ఈ సినిమా నుంచి రంగా సురేష్ అంటారేమో.. అని వివరించారు.
నిర్మాతల్లో ఒకరైన రామూరాథోడ్ మాట్లాడుతూ.. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించామన్నారు.
మరో నిర్మాత జి.ఎస్.ఆర్.చౌదరి మాట్లాడుతూ.. ఇటీవలే రాక్ క్యాజిల్, అల్యూమీనియం ఫ్యాక్టరీల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తయిందన్నారు. ఈ పాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారు.