టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. మొట్ట మొదట వినిపించే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌దే. డార్లింగ్ వయస్సు ప్రస్తుతం 40 ఏళ్లు. ఈ ఏడాది అక్టోబర్ 23తో 40వ పడిలోకి అడుగుపెట్టారు. అయితే ఇంతవరకూ ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటికీ మాట దాటవేస్తుండటం.. ఇదిగో ఈ సినిమా తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. అలా ‘బాహుబలి’ మూవీ పార్ట్-01 నుంచి ఇదే మాటలు చెబుతూ వస్తున్నాడు డార్లింగ్. ఆ మధ్య అమెరికా అమ్మాయి.. అని ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పెళ్లి అని కూడా వార్తలు గుప్పుమన్నాయ్.. ఆ తర్వాత మళ్లీ అబ్బే అవన్నీ ఉత్తుత్తే అని వైజాగ్ అమ్మాయిని ప్రభాస్ చేసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అది కూడా రూమర్ అని రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. ఇలా ప్రభాస్ పెళ్లి టాపిక్ సీరియల్ ఎపిసోడ్‌లా గడిచిపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ప్రభాస్ పెళ్లితో పాటు పలు ఆసక్తికర విషయాలను ఆయన పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవీ పంచుకున్నారు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఆమె తియ్యటి శుభవార్త చెప్పేశారు. ‘ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని మేం కూడా ఎదురుచూస్తున్నాం. ఆయన పెళ్లిపై వస్తున్న వార్తలను చదివి మేం నవ్వుకుంటున్నాం. ‘జాన్’ సినిమా పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ మాకు మాటిచ్చాడు. మాది చాలా పెద్ద కుటుంబం. అందరిలో కలిసిపోయే అమ్మాయే కావాలి. అందుకే అలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నాం. ఆ అమ్మాయి దొరగ్గానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు’ అని శ్యామల స్పష్టం చేశారు.
మొత్తానికి చూస్తే.. జాన్ సినిమా తర్వాత కచ్చితంగా డార్లింగ్ ఇంట పెళ్లి భాజాలు మోగుతాయన్న మాట. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో..? ప్రభాస్ ఎప్పుడు పప్పన్నం పెడతాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.