‘అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా! ఆతను చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే మాట్లాడతాడు. జనాల్ని మోసం చేసే సాధారణ వ్యక్తినైనా, మంత్రినైనా బట్టలు లేకుండా జనాల్లో నిలబెట్టే సత్తా ఉన్నవాడు. నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. ఆ అటవీ ప్రాంతంలో సమస్యను ‘రాజా నరసింహా’ ఎలా పరిష్కరించాడు అన్నదే మా చిత్రం’ అని దర్శకుడు వైశాక్ అన్నారు.
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన ‘మధుర రాజా’ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహా’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘మన్యం పులి’ సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నిర్మాత సాధు శేఖర్ మాట్లాడుతూ.. ‘చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముటీ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్‌తో పాటు ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్ సంగీతం, సన్నీలియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్స్ పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. వచ్చే నెల 1న సినిమాను విడుదల చేస్తున్నాం’అని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.