బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇటీవల మృతిచెందిన గొల్లపూడి మారుతీరావుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా నివాళి అర్పించింది. ఫిలిం ఛాంబర్‌లో బుధవారం తెలుగు సినిమా రచయితల సంఘం, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, ‘మా’ నటీనటుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు
ప్రముఖులు పాల్గొన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ గొల్లపూడి మారుతీరావు కమెడియన్‌గా, విలన్‌గా, తండ్రిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు పోషించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న వ్యక్తి అన్నారు. ప్రతి సంవత్సరం నూతన దర్శకుడికి తన కుమారుడి పేరుతో అవార్డు ఇవ్వడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందన్నారు. మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆణిముత్యాల లాంటి వారిని సినీ పరిశ్రమ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒకరు గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆయన ప్రతిభను పక్కన పెడితే ఆయన గొప్ప మానవతా వాది అని కొనియాడారు. ఇలాంటి వ్యక్తిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.
త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి ) మాట్లాడుతూ విజయవాడ ఆకాశవాణిలో ఆడియో నాటకాలతో ఆయన జీవితం ప్రారంభమైందన్నారు. ఆయనది గొప్ప వ్యక్తిత్వమన్నారు. సినిమా రంగంలో గోల్డెన్ ఎరా సమయంలో ఉన్న రచయితల సముదాయంలో ఆఖరి వ్యక్తి గొల్లపూడి మారుతీరావేనని అన్నారు. దర్శకుల సంఘం కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ కుమారుడి పేరున అవార్డుని ఇస్తూ దర్శకుడి గొప్పతనాన్ని చాటిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో మంచి దర్శకులను ఈ అవార్డుతో సత్కరించడం గొప్పవిషయం అన్నారు. ఫిలింనగర్ హౌసింగ్ సొసౌటీ కార్యదర్శి, కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ ప్రసంగిస్తూ గొల్లపూడి తనకు సన్నిహిత మిత్రుడన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘నిర్మాతకు ఎంతో సహకారం అందించే వ్యక్తి గొల్లపూడి, సామాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి, ఆయన భావజాలం ఎప్పటికీ బతికే ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా నిర్మాత రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.