మత్తు వదలరా ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 25న సినిమా విడుదల!
సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఈ సినిమాతో కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 25న చిత్రం విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ట్విట్టర్ ద్వారా హీరో రానా విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
చిత్ర సమర్పకుడు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఈ కథ విన్నాను. చాలా నచ్చింది. తపన కలిగిన యువప్రతిభావంతులంతా టీమ్‌గా ఏర్పడి అద్భుతంగా సినిమాను రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరావర్క్‌తో పాటు ప్రతి డిపార్ట్‌మెంట్ వారే స్వంతంగా సమకూర్చుకుంటూ సినిమా చేస్తామని చెప్పగానే అశ్చర్యపోయాను. ఇలా కూడా సినిమా రూపొందించవచ్చా అనిపించింది. రితేష్‌రానా చెప్పిన కథ నాలో ఆసక్తిని రేకెత్తించింది. సినిమాను చేయనని చెప్పడానికి ఛాన్స్ లేకుండా అద్భుతంగా ఉంది. యమదొంగ, ఒక్కడున్నాడు లాంటి పెద్ద సినిమాలు చేసిన చెర్రీ సుదీర్ఘ విరామం తర్వాత నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాకు మేము సమర్పకులుగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. పెద్ద హిట్ కంటెంట్‌ను చిన్న బడ్జెట్‌లో చేయడం ఉత్సుకతగా ఉంది. శ్రీసింహా, కాలభైరవ, రితేష్‌రానా, థామస్, తేజ అందరూ కొత్తవాళ్లు కలిసి అద్భుతాన్ని సృష్టించారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారనే నమ్మకం ముంది. ఇప్పటివరకు సినిమా చూసిన వారంతా సినిమా బాగుందని మెచ్చుకున్నారు. మేము ఎలాంటి అనుభూతికి లోనయ్యామో థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అదే ఫీల్‌ను కలిగించినప్పుడే నిజమైన సక్సెస్ లభిస్తుంది. ప్రేక్షకుల అంతిమతీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. హిట్ సినిమాతో ఈ ఏడాదిని ముగించబోతున్నామనే నమ్మకం ఉంది అని తెలిపారు.
నటుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ నటుడిగా నా తొలి సినిమా ఇది. ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నాతో పాటు చాలా మంది కొత్తవాళ్లను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. శ్రీసింహా తొలి సినిమాలా కాకుండా అనుభవజ్ఞుడిలా నటించారు. కాలభైరవ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాం అని అన్నారు.
సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది. తొలి సినిమా ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఇది నాకు డబుల్ స్పెషల్. ఈ సినిమాతో నేను సంగీత దర్శకుడిగా, నా తమ్ముడు హీరోగా అరంగేట్రం చేస్తున్నాం. పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమా ఇది. నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. సినిమా చేస్తున్నప్పుడు, చూసినప్పుడు చివరిక్షణం వరకు మేము ఎంజాయ్ చేశాం. మేము ఎంతగా ఆనందించామో ప్రేక్షకులు అలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. తొలి సినిమాతోనే మంచి కాన్సెప్ట్, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చిన నిర్మాత చెర్రీకి, మైత్రీ మూవీస్‌కు కృతజ్ఞతలు. ఇటీవల విడుదలైన టీజర్, పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది. ట్రైలర్‌తో పాటు సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.
దర్శకుడు రితేష్‌రానా మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రవిశంకర్, చెర్రీ ఈ కథ వినిపించాం. నాయకానాయికలు, ప్రేమకథ, పాటలు లేకుండా కేవలం పాత్రలు, వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రమే కనిపిస్తాయి. యథార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని రూపొందించాం. వినోదం, థ్రిల్లర్ సమ్మిళితంగా మేము చేసిన సరికొత్త ప్రయత్నమిది అని తెలిపారు.
హీరో శ్రీసింహా మాట్లాడుతూ.. కథానాయకుడు, దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కొత్తవాళ్లను నమ్మి సినిమా చేయడం అంటే సాహసమనే చెప్పాలి. మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత చెర్రీతో పాటు మైత్రీ మూవీస్ వారికి కృతజ్ఞతలు. థ్రిల్లర్ ప్రధానంగా సాగే చిత్రమిది. హీరో రానా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు సురేష్‌సారంగం, విజువల్ ఎఫెక్ట్స్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
అన్నారు.
నరేష్ ఆగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, కొరియోగ్రాఫర్: యశ్వంత్, స్టయిలింగ్, స్టంట్ కో-ఆర్టినేటర్: శంకర్ ఉయ్యాల, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్ట్, కథ, దర్శకత్వం: రితేష్ రానా.