జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’
రక్షిత్ శెట్టి హీరోగా పుష్కర్ ఫిలింస్ బ్యానర్‌పై పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె.ప్రకాశ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. సచిన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జనవరి 1న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రక్షిత్ శెట్టి, బాలాజీ మనోహార్, ప్రమోద్ శెట్టి, ఇమ్రాన్, రాజేష్, డిస్ట్రిబ్యూటర్ సతీష్, రామజోగ్యశాస్త్రి, శాన్వి శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. ‘‘అతడే శ్రీమన్నారాయణ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా జనవరి 1న విడుదలవుతుంది. దిల్‌రాజుగారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా విడుదలవుతుంది. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే సినిమా సక్సెస్ అయినట్లే. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటి వరకు శాన్విగారు నటించని ఓ జోనర్‌లో నటించారు. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది. దానికి గల కారణమేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రక్షిత్ శెట్టిలాంటి హీరోకు డైలాగ్స్ రాయడమంటే ఛాలెంజింగ్ విషయం. డైరెక్టర్ సచిన్‌గారు సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో నడిపించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. అలాగే అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నిధి అన్వేషణపైన జరిగే కథ ఇది. చిన్న పీరియాడిక్‌లా, కౌబోయ్ తరహా చిత్రం. డిఫరెంట్ జోనర్‌లో సాగుతుంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే చిత్రమవుతుంది’’ అన్నారు.
హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘‘ఐదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో రావడంతో చాలా సంతోషంగా ఉంది. రౌడీ సినిమా తర్వాత ఏడాదిన్నర పాటు ఏ సినిమా చేయలేదు. అయితే ప్రేక్షకుల సపోర్ట్‌తో మళ్లీ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.
హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. ‘‘ఉడిపి నుండి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇంజనీరింగ్ చదివే సమయంలో వంశీకృష్ణ అనే మిత్రుడు పరిచయం అయ్యాడు. అలా అప్పుడే తెలుగుతో పరిచయం ఉంది. నా ఇంజనీరింగ్ సమయంలో నేను యాక్టర్ అవుతానని ఎవరితోనూ చెప్పుకోలేదు. వంశీకృష్ణతోనే చెప్పుకునేవాడిని. మేం ఇద్దరం కలిసి షార్ట్ ఫిలింస్ చూసేవాళ్లం. చిరంజీవిగారు, నాగార్జునగారు, వెంకటేశ్‌గారి సినిమాలు చూసేవాడిని. కానీ తేడా తెలిసేది కాదు.. కానీ వంశీకృష్ణను చూసిన తర్వాత సినిమాపై ఎంత ప్యాషనేట్‌గా ఉండాలనేది తెలిసింది. నేను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ఎంతలా ఆదరిస్తారు, ప్రేమిస్తారు అని తెలిసింది. అందుకనే నా శ్రీమన్నారాయణను తెలుగులో విడుదల చేయాలని అనుకున్నాను. చాలా ప్యాషన్‌తో, ప్రేమతో సినిమా చేశాం. మూడేళ్ల కష్టం. గొప్ప జర్నీ. తెలుగు ప్రేక్షకులు నా సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. రామజోగయ్యగారికి థ్యాంక్స్. అలాగే తెలుగులో మా సినిమాను విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్’’ అన్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రక్షిత్ శెట్టిగారికి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఏ కళాకారుడైనా ఎక్కువ మంది ప్రేక్షకులను రంజింప చేయాలనుకుంటారు. అలాంటి ప్రయత్నమే ఇది. రక్షిత్ శెట్టిగారు మూడేళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించారు. ఆయన నాయకత్వంలో చేసిన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడం చాలా గొప్ప విషయం. ఓ బాహుబలి, కె.జి.యఫ్ తరహాలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాను. జనవరి 1న ఈ సినిమా విడుదలవుతుంది. దిల్‌రాజుగారు ఈ సినిమాను విడుదల చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. అన్ని పాటలు కథలో భాగంగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.