‘ఖైదీ’ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ పతాకాలపై ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ అందిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ పార్క్ హాయాత్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ తరపున ఆయన సన్నిహితులు వెంకట్, చక్రవర్తి అతిధులకు బొకేలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘2014లో ‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్ అయ్యి పెద్ద విజయం సాధించింది. అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కూడా సినిమా చేయాలి అనుకున్నా. ఇప్పుడు ‘దొంగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. దొంగ నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. మంచి కాస్ట్ అండ్ క్రూ కుదిరింది. ముఖ్యంగా మా హీరో, నా స్నేహితుడు కార్తీ సహకారం మరువలేనిది. జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, ప్రసన్న ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. హ్యూమర్, యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
హీరోయిన్ నిఖిలా విమల్ మాట్లాడుతూ.. ‘తమిళ్‌లో ఇది నా ఐదవ సినిమా. అలాగే తెలుగులో మూడవ సినిమా. కార్తీ గారు, సత్యరాజ్ సర్, జ్యోతికగారితో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే జీతూసర్ చాలా పెద్ద డైరెక్టర్ ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్’ అన్నారు.
సీనియర్ నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘దొంగ ఒక డిఫరెంట్ స్టోరీ లైన్. నా క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటూనే సరికొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు నాది పాజిటివ్ క్యారెక్టరా? లేక నెగటివ్ క్యారెక్టరా? అనే క్యూరియాసిటీ ఉంటుంది. కార్తీ, జ్యోతిక, నిఖిలాతో వర్క్ చేయడం హ్యాపీ. ఈ సినిమా ‘దృశ్యం’ కన్నా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. టీం అందరికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా’ అన్నారు.
డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి మాట్లాడుతూ.. ‘కంటెంట్‌కి టాలెంట్ తోడయితే ఎలా ఉంటుందో దొంగ సినిమా అలా ఉంటుంది. ఆర్.డి రాజశేఖర్ గారి సినిమాటోగ్రఫీ, గోవింద్ వసంత గారి సంగీతం, రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ చాలా బాగుంటాయి. జీతూజోసెఫ్‌గారు దృశ్యం సినిమాతో ఇండియా మొత్తం అభిమానులు ఏర్పాడ్డారు. షావుకారి జానకి గారికి ఒకే డైలాగ్ ఉన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కార్తీ గారికి పోటీగా నటించారు. నిఖిలా గారిది మంచి క్యారెక్టర్. సత్యరాజ్ గారి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. సినిమా విడుదలయ్యాక ఆయనను అందరు అభినందిస్తారు. ఒక ప్రిన్సిపల్ అక్క అయితే ఎలా ఉంటుందో జ్యోతిక గారి క్యారెక్టర్ అలా ఉంటుంది. కార్తీ గారు ఈసినిమాతో అందరి మనసుల్ని దోచేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థాంక్స్’ అన్నారు.
సీనియర్ దర్శకులు శివనాగేశ్వర రావు మాట్లాడుతూ.. ‘ఊపిరి సినిమాలో కార్తీ గారి పెర్ఫామెన్స్ అద్భుతం. జీతూ గారు మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్. కార్తీ గారి గురించి చెప్పలంటే వెయ్యిలో ఒక్కడు. మూడు సార్లు బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ సినిమా ఖైదీ కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ సన్నిహితులు చక్రవర్తి, వెంకట్ మాట్లాడుతూ.. ‘ఊపిరి తర్వాత ఖైదీతో మంచి స్టార్‌డమ్ క్రియేట్ చేసుకొని ఊపుమీదున్నారు కార్తీ. రెండు భాషల ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. చాలా కొద్ది మంది హీరోలకే అది సాధ్యం అయింది. అందులో కార్తీగారు, సూర్యగారు ఉండడం చాలా సంతోషం. మా తమ్ముడు శ్రీనివాస్‌కి ఎడ్యుకేషన్ అన్నా, సినిమా అన్నా మంచి ఫ్యాషన్ ఉంది. అందుకే మంచి మంచి సినిమాలు తెలుగులో అందిస్తున్నారు. చిరంజీవిగారికి దొంగ ఎంత పెద్దహిట్ అయిందో కార్తీ గారికి ఈసినిమాతో అంత కన్నా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాం’ అన్నారు.
యాంగ్రీ హీరో కార్తి మాట్లాడుతూ.. ‘ఖైదీ తర్వాత దొంగ ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. రెండు చిరంజీవి గారికి పెద్ద హిట్ ఇచ్చిన టైటిల్స్. ఎలాగైతే స్క్రిప్ట్‌కి తగ్గట్లు ఖైదీ అని పెట్టామో.. ఈ సినిమాకి కూడా అలానే దొంగ అని టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాగే అక్కా, తమ్ముడు రిలేషన్షిప్ ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్ సత్యరాజ్ గారు చేశారు. ఈమూడు క్యారెక్టర్ సినిమాకి పిల్లర్స్ లాంటివి. దృశ్యం లాంటి సినిమాని తెరకెక్కించిన స్ట్రాంగ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు అనగానే మా అందరిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. సత్యరాజ్ గారు డబ్బింగ్ చెప్పేటపుడు ఇది దృశ్యం-2 అనిపిస్తుంది. ఇదొక ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. షావుకారి జానకి, సీత గారి క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటాయి. 96 సినిమాకు చేసిన గోవింద్ వసంత గారు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. నా పేరు శివ, ఊపిరి కలిపితే వచ్చిన డిఫరెంట్ ఫిలింలా ఈ సినిమా ఉంటుంది. ఊపిరి సినిమాలో శీనూ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్. ఎక్కడికి వెళ్లిన ఎయిర్ పోర్ట్‌లో వీల్‌చైర్‌లో ఉన్నవారు నన్ను పిలిచి ఫోటో తీసుకుంటారు. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంటుంది. క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హాలిడే మూవీ. తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. మా నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ గారు సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. తెలుగులో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఈ కార్యక్రమంలో.. కెఎఫ్ సి కమలాకర్, జనార్దన్, ఇంద్ర ఫిలిమ్స్ తరుణ్, సజ్జు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్, నికిలావిమల్, షావుకారు జానకి, సత్య, సీత, రోషన్న ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత, మాటలు: హనుమాన్ చౌదరి, పాటలు: రామజోగయ్య శాస్రి, నిర్మాత: రావూరి వి. శ్రీనివాస్, దర్శకత్వం: జీతు జోసెఫ్.