టైటిల్ చూడగానే.. ఇదేంటి వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే కానీ.. వీరిద్దరూ నటీనటులుగా సినిమా ప్రత్యేకంగా చేయట్లేదు.. కానీ ఇద్దరు వేర్వేరు పాత్రల్లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇంతకీ వీళ్లకు ఈ బంపరాఫర్ ఇచ్చిందెవరు..? ఆఫర్ ఎలా వచ్చింది..? వీరి పాత్రలేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆణిముత్యాల్లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన కృష్ణవంశీ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే ఈయన రూటే సపరేటు. కాగా.. ఈయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ, అనసూయ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను తీసుకుంటున్నట్లు కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికర అప్డేట్ వెలుగుచూసింది.
అదేమిటంటే.. ప్రకాష్ రాజు కుమార్తెగా.. రాహుల్ సిప్లిగంజ్ జోడీగా అలనాటి స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తోందట. కాగా ఈ సినిమాలో శివాత్మిక పాత్ర పోషిస్తుందని సమాచారం. శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన, హావ భావాలు చూసిన కృష్ణవంశీ.. ఫలానా క్యారెక్టర్‌కు శివాత్మిక అయితేనే సరిగ్గా సెట్ అవుతుందని భావించి.. ఏరికోరి మరీ చాన్స్ ఇచ్చారట. మరీ ముఖ్యంగా.. కృష్ణవంశీ తన సినిమాలో ఎలాంటి పాత్రధారులైనైనా చాలా చక్కగా తీర్చిదిద్దడం.. చక్కగా చూపిస్తారనే పేరుంది. అందుకే ఈ సినిమాలో నటించాలని శివాత్మికను అడగ్గా ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మరి ఇందులో ఏ మాత్రం నిజముందో..? పాత్ర ఇచ్చిన విషయంలో నిజమెతుంది..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.