యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ (ఎల్ఎల్‌పి) బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా మూడో వారంలోను విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం సక్సెస్ పార్టీ నిర్వహించారు. పలువురు సినీరంగ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంతోషకరమైన రోజు సినిమాకు వస్తుందని అనుకోలేదు. సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. ఏదైనా మనమంచికే అన్నట్లు ఫైనల్ గా మంచి సక్సెస్ ను అందుకున్నాం. 14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టి థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీ. ఇంతటి ఘన విజయానికి ప్రధానంగా మూడు కారణాలు. మొదటి కారణమైన మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్. మా సినిమాకి హెల్ప్ చేయడానికి మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఆయన. ఈ సినిమాకు తొలి ఆడియన్, రివ్యూవర్, ప్రమోటర్ చిరంజీవి గారే. ఆయన వల్లే ప్రేక్షకులు మా సినిమాకు వచ్చారు. విజయానికి రెండో కారణం సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసిన మీడియా. మూడో కారణం కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీని తమ వర్డ్ ఆఫ్ మౌత్ తో మా సినిమాకు అందించిన ప్రేక్షకులు. మూడో వారంలో కూడా మా సినిమా ఆడుతోందంటే కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్. సినిమాను చివరి నిముషం వరకూ నమ్మి, ప్రమోట్ చేసిన నిర్మాతలకి ధన్యవాదాలు. దర్శకుడు సంతోష్ తో త్వరలో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. అద్భుతంగా నటించడమే కాదు ప్రమోషన్స్ లోను లావణ్య చాలా కోపరేట్ చేసింది. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ... ‘అనుక్షణం సినిమా గురించే ఆలోచించే వ్యక్తి నిఖిల్. తనని చూసి చాలా నేర్చుకుంటుంటాను. ట్రైలర్ చూడగానే ఇలాంటి ఎనర్జిటిక్ రోల్స్ లో నిఖిల్ అద్భుతంగా నటిస్తాడు అనిపించింది. అప్పటి నుండి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే పెద్ద హిట్ అవడం హ్యాపీ. టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అన్నారు.
నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ..‘మోసం విశ్వవాప్తం అయినప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య అని జార్జ్ ఆర్వెల్ చెప్పిన కొటేషన్ ఈ సినిమాకు స్పూర్తి. ఆదరించిన ప్రేక్షకులకు, హార్ట్ అండ్ సోల్ తో వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’ అన్నారు.
దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘ఎంతో హార్డ్ వర్క్ చేశాం. చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్ గా సక్సెస్ ను అందుకోవడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ గార్లకి థ్యాంక్స్. నిఖిల్ ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మౌత్ టాక్ తో సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాలో నటించిన, పనిచేసిన ప్రతి ఒక్కరు హండ్రడ్ పర్సంట్ ఎఫర్ట్ పెట్టారు. అందుకే ఈ చిత్రం ఇంతబాగా వచ్చింది. టీమ్ అందరికీ థ్యాంక్స్’ అన్నారు. కాగా.. సమర్పకులు ఠాగూర్ మధు, ప్రముఖ నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ఏషియన్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, నటీనటులు సత్య, కేదార్ శంకర్, కరాటే కళ్యాణి, విద్యుల్లేఖ రామన్, సినిమాటోగ్రాఫర్ సూర్య, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, ఫైట్ మాస్టర్స్ వెంకట్, డిసౌజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.