టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన సినిమా యూనిట్ రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ అంచనాలు మరింత పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో..’ చిత్రంగా గట్టిగా పోటీ ఇస్తుండటంతో నువ్వా.. నేనా అన్నంత రీతిలో ఢీ కొంటున్నాయి!.
నిన్న మొన్నటి వరకూ సరిలేరు కోసం సూపర్‌స్టార్ ఎంత పారితోషికం పుచ్చుకున్నారనే విషయం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఆయన రెమ్యునరేషన్ పైసా కూడా తీసుకోలేదట. ఎందుకంటే దీనికి పెద్ద లెక్కే ఉందట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే వైరల్ అవుతోంది. 10 కాదు 15 కాదు ఏకంగా రూ. 40 కోట్లవరకూ మహేశ్‌కు ముట్టిందట. పారితోషికం కింద ఆయన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్నట్లు సమాచారం.
శాటిలైట్ .. డిజిటల్ హక్కులను కలిపి సన్ టీవీ వారు 30 కోట్లకు కొనుగోలు చేశారట. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో 15 కోట్లకి పైగా వచ్చినట్లు ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అంటే మొత్తం 45 కోట్లు కాగా.. జీఎస్టీని పక్కనెడితే మహేశ్‌కు మిగిలింది 40 కోట్లు అన్నమాట. కాగా.. మహేశ్ తన సినిమాలకు ఎక్కువగా ఇలానే చేస్తుంటారన్న విషయం విదితమే. అయితే ఇప్పటి వరకూ ఓ లెక్క.. సరిలేరుతో మాత్రం ఓ లెక్కంట. ఈ సినిమాకు తీసుకున్నంత పారితోషిక ఇప్పటి వరకూ ఏ సినిమాకు మహేశ్ తీసుకోలేదని టాలీవుడ్ టాక్. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా 2020 సంక్రాంతికి థియేటర్లలోకి రానున్నది.