టాలీవుడ్‌లో ఒకప్పటి సంగతి పక్కనెడితే.. ఇప్పుడు మాత్రం మల్టీ స్టారర్ సినిమాలకు అంటే టక్కున గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్టీ విక్టరీ వెంకటేశ్ మాత్రమే. ఇప్పటికే ‘గోపాల గోపాల’, ‘ఎఫ్2’, ‘మసాలా’ మల్టీ స్టారర్‌గా నటించగా.. ఇప్పుడిక మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ అనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకమునుపే మరో మల్టీస్టారర్ సినిమా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ నటించేస్తూ సూపర్ డూపర్ హిట్లన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నాడు విక్టరీ.
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ రచయిత ఆకుల శివ.. వెంకీ బ్రదర్, ప్రొడ్యూసర్ సురేశ్ బాబుకు కథ చెప్పినట్టు సమాచారం. ఆ కథ సురేశ్ బాబుకు చాలా బాగా నచ్చేసిందట. ఆ కథకు వెంకీతో పాటు ఎవరైనా యంగ్ హీరో అయితే సెట్ అవుతుందని సురేశ్‌కు ఆయన చెప్పారట. దీంతో ముందుగా అనుకున్న ‘అసురన్’ మూవీని పక్కనెట్టి దానికంటే ముందుగా ఈ మల్టీస్టారర్ మూవీ చేద్దామని ఆయన ఫిక్స్ అయ్యారట. అంతేకాదు.. ఈ సినిమాకు తానే నిర్మాతగా కూడా వ్యవహరించాలని సురేశ్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో వెంకీకి జోడిని వెతికే పనిలో సురేష్ నిమగ్నమయ్యారట.
అయితే వెంకీతో పాటు నేచురల్ స్టార్ నానీ అయితే సరిగ్గా సెట్ అవుతారని ఆయన ఫిక్స్ అయ్యారట. అయితే ప్రస్తుతం నాని ‘వీ’, ‘టక్ జగదీష్’ బిజిబిజీగా ఉన్నాడు. నాని మాత్రం ఖచ్చితంగా చేస్తాననని చెప్పారట కానీ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ఇప్పట్లో కుదరదని చెప్పారట. వాస్తవానికి నానికి మల్టీస్టారర్ మూవీస్‌లో నటించడం కొత్తేమీ కాదు.. గతంలో నాగార్జునతో ‘దేవదాసు’లో నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే.. నాని బిజీగా ఉండటంతో ఈ గ్యాప్‌లో ‘అసురన్’ రీమేక్ చేద్దామా..? లేకుంటే మరో కుర్ర హీరోని సెలెక్ట్ చేసుకుందామా..? అని సురేశ్ మళ్లీ ఆలోచనలో పడ్డారట. మరి ఈ మల్టీస్టారర్ సినిమాపై వస్తున్న పుకారు ఏ మేరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.