టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరో, ప్రస్తుత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లో హాట్ టాపిక్‌గానే ఉండిపోయింది. ఫలానా పరిస్థితుల్లో తాను ఇలా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని పదేపదే చెప్పినప్పటికీ ఈ వ్యవహారానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడలేదు. ఎక్కడో ఒక చోట పవన్ ప్రస్తావన వస్తూనే ఉంది. తాజాగా.. ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న విమర్శలపై మీ కామెంట్ ఏంటి..? అనే ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు ఎక్కడా వివాదాస్పదం కాకుండా చాలా లాజిక్‌గానే నరేశ్ సమాధానమిచ్చాడు.
‘ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా?. ప్రతి వ్యక్తీ తన వ్యక్తిగత జీవితంలో వచ్చే ఇబ్బందుల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి సిగ్గు అనిపించదా..?’ అని నరేశ్ ఒకింత ఆగ్రహానికి లోనయ్యాడు. అనంతరం రాజకీయాల గురించి కూడా నరేశ్ తన అభిప్రాయాన్ని నిశితంగా వివరించాడు. తనకు పవన్ చాలా ఇష్టమని.. పవన్‌కే తన సపోర్ట్ (రాజకీయపరంగా) అని ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాల్లో పీక్‌లో ఉండగా తన కెరీర్‌ని వదిలి మరీ.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లోకి వెళ్లి పాటిస్తున్నారని.. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో కావాలని తన మనసులోని మాటను నరేశ్ బయటపెట్టాడు. రాజకీయం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని జనసేనాని కోరుకుంటున్నారని ఆయన చెప్పాడు. పవన్ ముందుకెళుతున్న విధానం తనకు నచ్చిందని, ఆయనకు తన నైతిక మద్దతు ఉంటుందన్నాడు.
ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందో, రెండొందల కోట్లో కావాలని చెప్పుకొచ్చాడు. మొత్తానికి చూస్తే నరేశ్ మాటలను బట్టి చూస్తుంటే రానున్న ఎన్నికల్లోపు పవన్ సమక్షంలో నరేశ్ జనసేన తీర్థం పుచ్చుకునేలానే ఉన్నాయని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన ఘట్టమనేని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక నరేశ్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే జనసేన కండువా కప్పుకునేందుకు దాదాపు సిద్ధమైనట్లే తెలుస్తోంది. మరి నరేశ్ మాటలు ఇంటర్వ్యూ వరకే పరిమితం అవుతాయా..? లేకుంటే రాజకీయాల వరకు దారితీస్తాయా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదేమో..!