నందమూరి నటసింహం బాలకృష్ణ-రోజాలు కలిసి చాలా సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరొందిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రోజా-బాలకృష్ణలు రాజకీయ ప్రత్యర్థులు. వైసీపీ నుంచి రోజా, టీడీపీ నుంచి బాలయ్య కయ్యానికి ఎప్పుడూ కాలుదువ్వుతారు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా.. ఇటు హీరోగా బాలయ్య కొనసాగుతున్నారు. రోజా మాత్రం వైసీపీలో కీలక పదవి దక్కించుకుని అటు రాజకీయాల్లో.. ఇటు ‘జబర్దస్త్’, ‘బతుకు జట్కాబండి’ షోలను విజయవంతంగా నడుపిస్తున్నారు. అయితే బుల్లితెరకు మాత్రమే పరిమితమైన ఈమె ఈ మధ్య వెండితెరకు కాస్త దూరంగానే ఉంటోంది. అయితే.. తాజాగా బాలకృష్ణ సినిమాలో రోజా ఫుల్ విలన్ పాత్ర వెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.
బాలయ్య సినిమాలో ఓకే కానీ..
అయితే ఆ రెండ్రోజులుకే అబ్బే నేను సినిమాలు చేయడమా.. అస్సలు చేయను బాబోయ్ అని రోజా అన్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. రోజా విలనిజం పండిస్తే ఆ సినిమాకి భారీ క్రేజ్ వస్తుందని దర్శకుడు బోయపాటి ఆశించారు.. అయితే ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయ్. అయితే రోజా ఎందుకు ఈ పాత్రకు నో చెప్పారు..? అనే విషయంపై ఆరాతీయగా ఓ కారణం చెప్పారని తెలుస్తోంది.
రోజాతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమేనట. సినిమాలో చేయడానికి ఒప్పుకోగానే రెండు లైన్లు చెప్పారట. అయితే విలన్ పాత్ర అని తెలియగానే కుదరదని చెప్పేశారట. మీరు తీయబోయే సినిమాల్లో విలన్ కాకుండా ఏదైనా మంచి పాత్ర ఉంటే చేస్తాను చెప్పండి సార్.. కానీ ఈ పాత్ర చేయలేనని చెప్పారని సమాచారం. రోజా నో చెప్పడంతో మరో సీనియర్ నటిని సంప్రదించే పనిలో దర్శకనిర్మాతలు నిమగ్నమయ్యారని టాక్ నడుస్తోంది. మరి ఎవర్ని తీసుకుంటారో..? ఆ పాత్రకు న్యాయం చేసేవాళ్లెవరున్నారో వేచి చూడాలి.