మంచి మెసేజ్‌తో రూపొందిన ‘మిస్ మ్యాచ్’ చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను - తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు
ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై ఎన్ వి. నిర్మల్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దేశపతి శ్రీనివాస్, శ్రీవిష్ణు సహా ఎంటైర్ యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. బిగ్‌సీడీని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. బిగ్ టికెట్‌ను విక్టరీ వెంకటేశ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా.. తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ - ‘‘శ్రీరాంగారిపై ఉన్న గౌరవంతో నేను ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, కొత్త దర్శకులు, నటీనటులు అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. ‘మిస్ మ్యాచ్’ కూడా అదే కోవలో కనపడుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రమిదని నాకు అర్థమైంది. ఓ ప్రేమికురాలి విజయం కోసం ప్రేమికుడు పడే తపనను చూపించే చిత్రమిది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమని అర్థమవుతుంది. ప్రేమ మనిషిని విజయ పథం వైపు నడిపించాలి. అలా పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండాలే కానీ.. వికృత రూపం తీసుకోకూడదు. ఉదయ్‌శంకర్ 15 సంవత్సరాల వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. నిజ జీవితంలోలాగానే తెలివైన ఐఐటీ స్టూడెంట్‌గా యాక్ట్ చేశాడు. సినిమాల్లో మంచి సందేశం ఉండాలి. సినిమాలతో గౌరవం పెరగాలి. వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి. మహిళల గౌరవం పెరిగేలా సినిమాలుండాలి. అలాంటి ఓ మంచి సినిమా ఇదని అర్థమవుతుంది. ‘మిస్ మ్యాచ్’ సమాజంతో మ్యాచ్ కావాలని, మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్ నా హృదయానికి ఎంతో దగ్గరైనవారు. వారందరికీ ఆల్ ది బెస్ట్. ఉదయ్‌శంకర్ గురించి చెప్పాలంటే తన తొలి చిత్రం ఆటగదరా శివలో అద్భుతంగా నటించాడు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’ లో మరో అద్భుతమైన పాత్రలో నటించాడు. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి దగ్గరైన పాత్ర. తను 15ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం. తను హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. ఐశ్వర్యారాజేష్ మరో అద్భుతమైన పాత్రలో నటించింది. తనకు కూడా అభినందనలు. నిర్మాతలు భరత్, శ్రీరామ్‌కు అభినందనలు. భూపతిరాజాగారు వండర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను అందించారని అర్థమవుతుంది. అమ్మాయిలు ఉన్నతస్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్టపడతాను. రాజా, సూర్యవంశం వంటి అలాంటి సినిమాల్లో నేను కూడా నటించాను. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చూశాను. తప్పకుండా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ నిర్మల్ కుమార్ టాలెంటెడ్ డైరెక్టర్. డిసెంబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘ఉదయ్‌శంకర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విక్టరీ వెంకటేశ్, పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి చెప్పారు. ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పాలంంటే ఆవిడ అమ్మగారు గురించి చెప్పాలి. ఆవిడ ఎంతో కష్టపడి ఎదిగారు. నాతో పాటు 50-60 సినిమాలకు కలిసి పనిచేశారు. కౌసల్య కృష్ణమూర్తితో ఐశ్వర్య తెలుగులో సిక్సర్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాలో తను చేసే బాక్సింగ్‌తో బాక్సాఫీస్ బద్దలవుతుంది. నిర్మల్ కుమార్ తొలి సినిమా సలీమ్‌ను చక్కగా తెరకెక్కించాడు. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.
ప్రముఖ రచయిత సీతారామ శాస్త్రి మాట్లాడుతూ - ‘‘నేను గురువుగా భావించే శ్రీరామ్‌సార్‌గారికి శిరస్సు వంచి ప్రణామాలు. ఆయన తనయుడి చిత్రోత్సవానికి రావడం సంతోషంగా భావిస్తున్నాను. ఈ కథ ప్రారంభం నుండి జీవీజీ రాజుగారు నన్ను ట్రావెల్ చేయించారు. నేను తొలి ప్రేమ సినిమాలో రాసిన ఈ మనసే సే.. పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయించి ఉపయోగించాం. నిర్మల్ కుమార్‌గారు మంచి డైరెక్టర్. ఆయనకు తెలుగు చిత్రసీమలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ పాటలు వింటుంటే గిఫ్టన్ మంచి సంగీతాన్ని అందించారని తెలుస్తోంది. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్యా రాజేశ్ ఈ సినిమాతోనూ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి(ఓఎస్‌డీ) దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘కేవలం శరీరాల మధ్య ఉండే ఆకర్షణనే ప్రేమగా చూపిస్తున్న సినిమాలు వస్తున్న సందర్భంలో ఓ ప్రేయసి విజయం వెనుక ప్రియుడు ఉండటం అనే కాన్సెప్ట్ మీద వస్తున్న సినిమా ఇది. ప్రేయసి విజయం కోసం... బిడ్డ కన్న కలను సాకారం చేయడానికి పరితపించే తండ్రి కలను నిజం చేయడానికి హీరో పడే కష్టం.. ఉదాత్తమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఇలాంటి మంచి విషయాలతో సినిమాలు వస్తే సమాజానికి అవి మంచి మ్యాచ్ అవుతాయి. ఓ మంచి సినిమాను తీసిన నిర్మాతను, దర్శకుడిని, యూనిట్‌ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ డాలీ మాట్లాడుతూ - ‘‘నాకు ఏడాదిన్నర క్రితం భూపతిగారు ఈ సినిమా పాయింట్‌ను ఓ డిస్కషన్‌లో చెప్పారు. బ్యూటీఫుల్‌గా అనిపించింది. డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోందని తెలియగానే పర్‌ఫెక్ట్ మ్యాచ్ ఇదని అనుకున్నాను. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
దర్శహకుడు చంద్ర సిద్ధార్ధ మాట్లాడుతూ.. ‘‘హీరో కావాలనుకునే వారు మంచి కాస్ట్యూమ్స్, రిచ్ లుక్, పోరాటాలు, భారీ ఛేజ్ లు ఇలాంటివి ఉండాలనుకుంటారు. కానీ ఇవేవీ లేని మా ఆట గదరా శివ హీరో ఈ చిత్రం చేయటం నన్ను ఆలోచింప చేసింది. ఉదయ్ శంకర్ చేసే ప్రతి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘చిత్రం పెద్ద విజయం సాధించాలని యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.’’
కధానాయకుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘హీరో ఉదయ్ శంకర్ కు చిత్రం పెద్ద విజయం సాధించి, పేరు తేవాలని అభిలషించారు.’’
చిత్ర హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ... ‘‘నన్ను ఆశీర్వదించటానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు. చిత్రం కధ, కధనాలు వైవిధ్యంగా ఉంటాయి. సగటు సినిమా ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది. నాతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలన్నారు.’’
కథానాయిక ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ.. ‘‘నేను వెంకటేష్ గారికి పెద్ద అభిమానిని. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది’’ అన్నారు.
రచయిత భూపతి రాజా మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ మాట్లాడుతూ - ‘‘సంగీతం అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. జీవీజీగారి అభినందనలు, కుటుంబ సభ్యుల ప్రోత్సహంతో ఇక్కడ నిలబడి ఉన్నాను. నిర్మల్‌గారికి, భూపతిగారికి, నాకు సహకారం అందించిన వారికి థ్యాంక్స్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ - ‘‘వేడుకకి వచ్చిన హరీశ్‌రావు గారికి, వెంకటేశ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన జీవీజీ రాజుగారికి, మంచి కథ ఇచ్చిన భూపతిరాజా గారికి థ్యాంక్స్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ ఇది. ఉదయ్‌శంకర్‌గారు చాలా యాక్టివ్ హీరో. ఈ మనసే సాంగ్‌ను మూడు రోజులు ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్‌లో చేశారు ఉదయ్‌శంకర్. తెలివైన అబ్బాయి.. విలేజ్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఇది. కౌసల్య కృష్ణమూర్తి చిత్రంలో క్రికెట్ ప్లేయర్‌గా నటించిన ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమా కోసం రెజ్లర్ గా నటించారు. అందుకోసం ఆమె మూడు నెలలు పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. గిఫ్టన్ సంగీతం చక్కగా అందించారు. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ మాట్లాడుతూ - ‘‘మా టీమ్‌ను అభినందించడానికి వచ్చిన హరీశ్‌రావుగారికి, వెంకటేశ్‌గారికి ధన్యవాదాలు. ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేశ్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి సినిమాను తెరకెక్కించారు. మంచి కథతో రూపొందించిన చిత్రమిది. డిసెంబర్ 6న విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ రామ్ మోహనరావు, చిత్ర బృందం పాల్గొన్నారు. హాత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డా.దిశ మృతికి నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించింది వేడుకకు హాజరైన వారితో పాటు ‘మిస్ మ్యాచ్’ చిత్ర బృందం.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్, దర్శకుడు: ఎన్.వి.నిర్మల్ కుమార్ .