ఒకప్పటి టాలీవుడ్ హీరో.. ప్రస్తుత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మొన్నటి వరకూ తానూ హీరోననే విషయాన్ని మరిచి మాట్లాడారో లేకుంటే.. మరేంటో కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు.. పేరు పెట్టి మరీ మహేశ్ బాబు సహా హీరోలందరిపైన పవన్ కామెంట్స్ చేశారు. ఇంతకీ పవన్ చేసిన కామెంట్స్ ఏంటి..? ఎందుకాయన హీరోలపై పడ్డారు..? హీరోల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందా? లేదా..? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తెలుగును కాపాడుకుందాం!
మన భాషను కాపాడుకుందాం.. ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుందామంటూ గత కొన్ని రోజులుగా పవన్ గళమెత్తుతున్న విషయం విదితమే. కాగా రాయలసీమ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్న పవన్ సోమవారంనాడు తిరుపతిలో జనసైనికులు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటు ప్రభుత్వంపై.. ఇటు చిత్ర పరిశ్రమలోని హీరోలపై ఆయన హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బయటికి చెప్పలేనప్పటికీ తెలుగు హీరోల్లో కొందరు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. టైమ్ వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటికొస్తాయని కొందరు విమర్శకులు చెబుతుతున్నారు.
ఇంతకీ పవన్ ఏమన్నారు..!?
‘ఇంగ్లీష్ మీడియం వల్లే ఇంటర్ నుంచే చదువు ఆపేశాను. చదువు విజ్ఞానం ఇవ్వాలే కానీ.. భయాన్ని కాదు. మాతృభాష మర్చిపోతే ఎన్నో ఆకృత్యాలు జరుగుతాయి. సుమతి శతకాలు మనిషిని సరైన దారిలో నడిపిస్తాయి. సినిమా సాహిత్యం రానురాను దిగజారిపోతోంది. తెలుగు హీరోలకు తెలుగు రాయటం, మాట్లాడటం రాదు. నిజంగానే మన ఇండస్ట్రీలో మహేష్ బాబు సహా మరికొందరు హీరోలకు తెలుగు చదవడం రాయడం రాదు.. కానీ వాళ్లు అవేం తెలియకుండా చక్కగా తమ పని తాము చేసుకుంటున్నారు. అయినా తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు కావాలి. ఇండస్ట్రీలో తెలుగు దిగజారిపోతోంది. దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు నటులపై కూడా ఉందని గుర్తించుకోవాలి’ అని ఒకింత వారికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు పవన్.
కన్నెర్రజేస్తున్న సెలబ్రిటీలు!?
అయితే ఇప్పటి వరకూ ఇండస్ట్రీ గురించి పొల్లెత్తి మాట అనని పవన్ ఫస్ట్ టైం మాట్లాడి.. ఇలా హీరోలపై కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. అయితే పవన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆయనంటే పడని వాళ్లే కాదు.. సొంత అభిమానులు సైతం కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేయడం గమనార్హం. అంతేకాదు.. అదేదో సామెత ఉంది కదా.. తిన్నింటి వాసాలే లెక్కపెడతా..? టాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి ఈ మాటలేంటి..? అని కొందరు కన్నెర్రజేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమం అని కీలక ప్రకటన చేయగా.. ఇప్పటికే హీరో డాక్టర్ రాజశేఖర్‌తో పాటు పలవురు నటీనటుమణులు ఇంగ్లీష్ బాష ప్రవేశపెడుతుండంపై మబాట్లాడి మంచి పని చేస్తున్నప్పుడు ఆదరించాలని జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. మరి పవన్ తాజా వ్యాఖ్యలపై ఎవరెలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.