టిక్ టాక్.. టిక్ టాక్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న కొందరు నిద్రలేచింది మొదలుకుని మళ్లీ నిద్రపోయే వరకూ పొద్దు గడిపేస్తున్నారు. మిగతా ఎన్ని యాప్‌లు ఉన్నా అనతి కాలంలోనే మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్‌గా టిక్ టాక్ గుర్తింపు తెచ్చుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తెగ వాడేస్తున్నారు. అయితే ఓ కుర్ర హీరో మాత్రం ఎవరేమనుకున్నా సరే.. టిక్ టాక్‌ను మాత్రం వదిలే ప్రసక్తే లేదని అంటున్నాడు. అంతేకాదండోయ్.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎన్నున్నా తనకు మాత్రం టిక్ టాకే కావాలని.. దీని ద్వారానే అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇంతకీ ఎవరబ్బా ఆ యంగ్ హీరో అనే సందేహం వచ్చింది కదూ.. ఆయనేనండి.. సంచలన చిత్రంతో తనకంటూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న ‘ఆర్ఎక్స్-100’ హీరో కార్తికేయ. అటు హీరోగా.. అవకాశాల్లేకపోతే విలన్‌గానూ ఈ కుర్ర హీరో రాణిస్తున్నాడు. అయితే ఈ మధ్య అందరూ ఏవేవో యాప్‌లు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే.. ఇతను మాత్రం వదల బొమ్మాళీ.. నిన్నొదల అన్నట్లు టిక్ టాక్‌ను వదలనంటూ తనకు సంబంధించిన వీడియోలే కాదు.. సినిమా ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నాడు.
కాగా.. కార్తికేయ హీరోగా.. క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ ‘90 ఎం.ఎల్’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి తెరకెక్కించారు. డిసెంబర్ 5న 90 ఎంఎల్‌తో కుర్రహీరో థియేటర్లలోకి రానున్నాడు. ఈ సందర్భంగా ఓ వైపు ఇంటర్వ్యూలు.. మరోవైపు కాలేజీల్లో ఈవెంట్స్ చేస్తూ.. టిక్‌టాక్‌లోనూ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.
ఈ టిక్ టాక్‌ను అనవసర పనులకు వాడుకొని తద్వారా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో..? దేశ వ్యాప్తంగా ఎన్నెన్ని ఘటనలు చోటుచేసుకున్నాయో చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే యంగ్ హీరో మాత్రం పనికొచ్చే.. అది కూడా ప్రమోషన్స్‌కు వాడుకుంటున్నాడంటే సంతోషించాల్సిన విషయమే. సో.. ఈ కుర్ర హీరోకు టిక్ టాక్ స్టార్ కార్తికేయ అని పేరు పెడితే సరిగ్గా సెట్ అవుతుందేమో మరి.