2014 ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా బీజేపీ తప్ప మరో పార్టీ ఉండకూడదని భావించిన కమలనాథులు ఆ దిశగా అడుగులేస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో చాలా డల్‌గా ఉన్న బీజేపీని బలోపేతం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘ఆపరేషన్ కమల్’కు తెరలేపిన బీజేపీ.. ఇతర పార్టీల్లోని ముఖ్యులు, కీలక నేతలు, మాజీలు, ద్వితియ శ్రేణి నాయకులను చేర్చుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు.. మరీ ముఖ్యంగా సినిమా నటీనటులు, బిజినెస్‌మెన్‌లను సైతం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించేసి కండువాలు కప్పేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు పలువురు సినీ నటులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
బీజేపీతో టచ్‌లో ఉన్నారా..!?
టాలీవుడ్‌లో నాటి నుంచి నేటి వరకూ టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలుతున్న బ్రహ్మానందంపై బీజేపీ కన్నుపడింది. ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్రహ్మీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వయసు మీద పడుతుండటం.. కాస్త అవకాశాలు కూడా తగ్గుతుండటంతో సెకండ్ ఇన్నింగ్స్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఆయన పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నందునే తెలుగు రాష్ట్రాల కమలనాథులతో పాటు బెంగళూరుకు చెందిన ఒకరిద్దరూ బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నాడని తెలియవచ్చింది.
మిత్రుడి కోసమేనా!?
ఈ క్రమంలోనే కర్ణాటకలో ఉప ఎన్నికలు ఉన్నందున ఆయన్ను బీజేపీ అభ్యర్థులు హైదరాబాద్‌కు వచ్చి మరీ బెంగళూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం బ్రహ్మీ బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం బిజీబిజీగా గడుపుతున్నారు. చిక్క బళ్లాపురలో బీజేపీ అభ్యర్థి తరఫున రోడ్ షో నిర్వహించారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ ఓటేసి.. వేయించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. పైకి మాత్రం బీజేపీలో చేరడానికి ఆయన రెడీగా ఉన్నప్పటికీ వాటిని కవర్ చేయడానికి.. సుధాకర్ రెడ్డి అనే బీజేపీ అభ్యర్థి తనకు మంచి మిత్రుడని అందుకే ఎన్నికల ప్రచారానికి వచ్చానని చెప్పుకుంటున్నారు.
బ్రహ్మీ మనసులో ఏముంది!?
వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఇందుకు ఉదాహరణ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, పోసాని, కృష్ణుడు, మోహన్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు సినిమాలు కమ్ రాజకీయాల్లోనూ ఉన్నారు. అందుకే తానేం తక్కువ.. అటు ఇటు తాను అడుగులేయాలని భావించారో..? లేకుంటే ఎన్నికల ప్రచారానికి కూడా రెమ్యునరేషన్ ఇస్తానంటే వెళ్లారో..? లేకుంటే ఎలాగో బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని ఫిక్స్ అయ్యే ఇలా రంగంలోకి దిగారా..? అన్నది బ్రహ్మీకే ఎరుక. బ్రహ్మీ భవితవ్యం ఎలా ఉందో జస్ట్ వెయిట్ అండ్ సీ..!