శంషాబాద్‌లో వైద్యురాలిపై జరిగిన హత్యోదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బహుశా దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత అంతటి ఘోర ఘటన శంషాబాద్‌దే అని చెప్పవచ్చు. అందుకే మీడియా కూడా ఈ ఘటనకు ‘తెలంగాణ నిర్భయ’ అని పేరు పెట్టింది. మరోవైపు.. పోలీసులు సైతం ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి పేరుకు బదులుగా ‘దిశ’.. నిరసనలు తెలిపేటప్పుడు ‘జస్టిస్ ఫర్ దిశా..’ అని సంబోంధించాలని సూచించారు. ఇప్పటికే టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకూ సెలబ్రిటీలు స్పందించి తమదైన సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని సీనియర్, జూనియర్ హీరోలంతా స్పందించారు. కాగా చిరు స్పందించిన తర్వాత ఈ ఘటనను మరిచిన, పట్టించుకోని వారు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఇంతకు మునుపే బాధితురాలు అలెర్టయ్యి ‘100’కు ఎందుకు కాల్ చేయలేదు..? అని పదే పదే ప్రశ్నలు గుప్పిస్తున్న వారికి డైరెక్టర్ సుకుమార్ స్ట్రాంగ్ కౌంటరే ఇస్తూ బుద్ధి చెప్పారు. అయితే తాజాగా.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ వీడియోలో స్పందించారు. కాగా.. ఈ వీడియోలో మగాళ్లపై ఒకింత అసహనం.. ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.
అబ్బాయిలకు చెప్పండి.. యాక్షన్ కావాలి!
రేప్ అండ్ మర్డర్ ఘటన అనేది ఒక్క ఆడవాళ్ల అంశమే కాదని.. అసలు ఈ విషయంలో మగాళ్లు ఎందుకు స్పందించట్లేదు..? మాట్లాడటానికి ఎందుకు ముందుకు రావట్లేదు..? అని ఈ సందర్భంగా ఆయన సూటి ప్రశ్న సంధించారు. అసలు మగాళ్లెందుకు నిరసన తెలపడం లేదు..? ఎందుకు గొంతెత్తత్తడం లేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మీ సొంతం అనుకోడానికి.. అమ్మాయిలంటే వస్తువులు కాదన్నారు. గౌరవం, స్వేచ్ఛ వాళ్ల హక్కు అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. బాధ్యతగా నడుచుకోమని.. సత్ప్రవర్తన నేర్చుకోమని అబ్బాయిలకు చెప్పండని మగపిల్లల తల్లిదండ్రులకు పరోక్షంగా సూచించారు. అంతా జరిగిపోయిన తర్వాత కావాల్సింది రియాక్షన్ కాదని.. యాక్షన్ అని ఈ సందర్బంగా ఒకింత ఆవేదనకు లోనవుతూ విక్టరీ చెప్పుకొచ్చారు. వెంకీ మాటలను అభిమానులు, నెటిజన్లు, విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. మరో ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.