హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వైద్యురాలిపై జరిగిన హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. లోకల్ మీడియా మొదలుకుని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలు సైతం ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ప్రత్యేక కథనాలు సైతం టీవీల్లో ప్రసారం చేస్తూ.. పేపర్లలో రాస్తున్నారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ఇప్పటికే ఓ సారి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు.
అయినా మారడం లేదు..!
‘రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి.. సమాజంలో పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఉన్నత విలువలను సాధించడంలో విఫలమవుతున్నాం. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విన్నపం చేశారు. అంతటితో ఆగని ఆయన.. మనందరం కలిసి మహిళలకు అండగా నిలిచి.. దేశాన్ని సురక్షితంగా మార్చుదామని ఈ సందర్భంగా మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తన ట్వీట్‌ను ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
మరోవైపు మహేశ్ ట్వీట్స్‌పై ఘట్టమనేని వీరాభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు రియల్ హీరో అనిపించుకున్నారు సార్.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేశ్ విన్నపానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.