హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వైద్యురాలిపై జరిగిన హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు కామాంధులను నడిరోడ్డుపై ఉరితీసి చంపాల్సిందేనని డిమాండ్ ఎక్కడ చూసినా వినిపిస్తూ.. కనిపిస్తోంది. అవును.. కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తేగానీ పరిస్థితులు అదుపులోకి రావని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ దారుణ ఘటనపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సినీ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఈ ఘటనపై డైరెక్‌గా తన సినిమాలో ఓ గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ రియాక్ట్ అయ్యారు. ఓ కార్యక్రమంలో సుక్కూ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
దయచేసి మమ్మల్ని నమ్మొద్దమ్మా..!
‘నేరస్తులు ఎక్కడి నుంచో రారు.. మన మధ్యే తయారవుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఘోరాలను చెప్పడానికి నేను సరిపోను. వెటర్నరీ వైద్యురాలు ఆ సమయంలో 100 నంబరుకు ఫోన్ చేయాల్సిందని చాలామంది చెబుతున్నారు కానీ.. నలుగురు కుర్రాళ్లు హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే 100 నంబరుకు ఫోన్ చేయడం ఏం బాగుంటుందని ఆ అమ్మాయి భావించి ఉంటుందేమో. సాయం చేయడానికి వస్తే పోలీసులను పిలుస్తావా అక్కా..? అని వాళ్లు అడిగితే ఏంచెప్పగలను అని ఆమె అనుకొని ఉండొచ్చు. అమ్మాయిలు అబ్బాయిల్ని అంతగా నమ్ముతారు. కానీ తల్లీ, దయచేసి మమ్మల్ని నమ్మొద్దమ్మా..! మేం మృగాళ్లం. సొంతవాళ్లను కూడా నమ్మొద్దు తల్లీ. ప్రతి ఒక్కరినీ అనుమానించండి... అనుమానం వస్తే ముందు 100 నంబరుకు ఫోన్ చేయండి. ఒకవేళ మనం పొరబడితే క్షమాపణ అడుగుదాం అంతే తప్ప ప్రమాదంలో చిక్కుకోవద్దు’ అని తీవ్ర భావోద్వేగంతో సుక్కు మాట్లాడారు.
గట్టిగానే బుద్ధి చెప్పిన సుక్కు!
కాగా.. వాస్తవానికి ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఏ నోట విన్నా.. హోం మంత్రి మొదలుకుని పోలీసుల వరకూ ప్రతి ఒక్కరు 100 నంబర్‌కు ఎందుకు ఫోన్ చేయలేదు..? ఎందుకు ఆలస్యమైంది..? అనే ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఆమె ఎందుకు అలా చేయలేదో..? ఆ వైద్యురాలి ఇంటెన్షన్ ఏంటో తన వంతుగా సుక్కు షేర్ చేసుకున్నారు. అయితే.. ఇలా అస్తమాను విమర్శలు గుప్పిస్తున్న.. ప్రశ్నిస్తున్న వారికి డైరెక్టర్ లాగి చెంపదెబ్బి కొట్టినట్లుగా సమాధానం చెప్పారని పలువురు నెటిజన్లు, సినీ ప్రియులు, కామెంట్స్ చేస్తున్నారు.