వెటర్నరీ డాక్టర్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆ కామాంధులకు భూమ్మీద బతికే హక్కు లేదని తక్షణమే వారి ఎన్‌కౌంటర్ లేదా ఉరి తీయాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖ నటీనటులు స్పందిస్తున్నారు. తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై అత్యాచారాలు.. జరుగుతున్న హత్యల గురించే వింటుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
నిజంగా ఈ దేశంలో ఆడపిల్లలకు ఇంకా భద్రత లేదనే భావన కలుగుతోందని.. ఇలాంటి మగమృగాల మధ్య మనం తిరుగుతున్నామా..? అనిపిస్తోందన్నారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని.. నిందితులను నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పు లేదని చిరు చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పు చేసిన వాడెవడైనా సరే చంపేయాల్సిందేనని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే త్వరగా నేరస్థులను పట్టుకోవడం మంచిదే.. కానీ త్వరితగతిన శిక్ష పడటం కూడా అనివార్యమన్న విషయాన్ని చిరు గుర్తు చేశారు. ఆడపిల్లలందరూ దయచేసి మీ ఫోన్స్‌లో 100 స్టోర్ చేసుకోండి.. అలాగే ‘హాక్ ఐ యాప్’ డౌన్‌లోడ్ చేసుకోండని మెగాస్టార్ సూచించారు. ఒక్క బజర్ నొక్కితే షీ టీమ్స్ వస్తాయని పోలీసు వారి సేవలు.. వారి టెక్నాలజీని వాడుకోవాలని ఆడపిల్లలకు ఆయన సూచించారు. ఆడవాళ్లను గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ చిరు ఆవేదనతో ముగించారు.