వెటర్నరీ డాక్టర్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆ కామాంధులకు భూమ్మీద బతికే హక్కు లేదని తక్షణమే వారి ఎన్‌కౌంటర్ లేదా ఉరి తీయాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆ నిందితులున్న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై తాజాగా టాలీవుడ్ కమెడియన్ అలీ స్పందించారు.
శనివారం మధ్యాహ్నం బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ సందర్భంగా తాను కుటుంబానికి అండగా ఉంటానని అలీ అభయమిచ్చారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ‘ఇటువంటి దారుణ ఘటనలు జరగడం బాధాకరం. హైదరాబాద్ శివార్లలో నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన రేకెత్తించే విషయం. ఈ ఘటనలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నిందితుల తరఫున న్యాయవాదులెవ్వరూ వాదించొద్దు. పిల్లల చదువు కోసమే ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు శంషాబాద్ వచ్చారు. ఆమె తల్లిదండ్రులకు సాయం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మృతురాలి తండ్రి గతంలో సైన్యంలో సేవలు అందించారు.. అలాంటి కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం’ అని అలీ భావోద్వేగానికి లోనయ్యారు.
మొత్తానికి చూస్తే.. నిందితుల తరఫున వాధించొద్దని న్యాయవాదులను అలీ కోరారు. అయితే ఇది ఏ మాత్రం జరుగుద్దో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే న్యాయవాద సంఘలు, బెంచ్‌లు ఈ ఘటనను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాలని ఆందోళన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయ్. అయితే నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మున్ముంథు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నా.. ఆడవారివైపు కన్నెత్తి చూడటానికి కామాంధులు జంకాలన్నా వారిపట్ల పోలీసులు, ప్రభుత్వం చేయి కలిపి కఠినంగా వ్యహరించాల్సిందే మరి.