వెటర్నరీ వైద్యురాలిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై.. సజీవ దహనం చేసి దారుణంగా హత్యచేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్, సీపీ సజ్జనార్, షీ టీమ్ స్పందించింది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, నటీమణులు అనుష్క, కీర్తి సురేష్, పూనమ్ కౌర్, కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
అందరం కలిసి పోరాడుదాం!
‘సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా?. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయ్. అమాయకురాలైన డాక్టర్‌ని అత్యాచారం చేసి చంపేశారని... ఇది మొత్తం మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదాం’ అని అనుష్క చెప్పుకొచ్చింది.
నేను కర్మను నమ్ముతాను..!
‘వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, సజీవదహనం చేశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ వంటి నగరంలో ఇంత దారుణ ఘటనకు ఎవరిని నిందించాలి? రోజులో ఏ సమయంలోనైనా ఓ అమ్మాయి సురక్షితంగా తిరిగే రోజులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి? నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే. నేను కర్మను నమ్ముతాను. అది 24/7 పనిచేస్తూనే ఉంటుంది’ అని కీర్తి సురేష్ ట్విట్టర్‌లో తీవ్ర ఆక్రోశం, ఆవేదనతో రాసుకొచ్చింది.
అసహ్యంగా ఉంది!
‘ డాక్టర్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేయగా.. మీ కుమార్తె ఎవరితోనో వెళ్లిపోయుంటుందేమో అని పోలీసులు చులకనగా మాట్లాడినట్టు తెలిసింది. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని లేచిపోయిందేమో అనడానికి పోలీసులకు సిగ్గు లేదా?. అసహ్యంగా ఉంది, పోలీసుల తీరు మర్యాదకరం అనిపించుకోదు’ అని పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అయితే పోలీసులు నిజంగానే ఇలా రియాక్ట్ అయ్యారా లేకుంటే ఇదంతా ఫేకా అనేదానిపై ఖాకీలు రియాక్ట్ కావాల్సిన ఎంతైనా ఉంది.
సారీ సిస్టర్..!
‘గుణ 369 సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో నటిస్తున్నప్పుడే నాకు నాలుగైదు రోజులు చాలా డిస్టర్బింగ్‌గా ఉండేది. అలాంటిది నిజంగా అలాంటి ఘటన జరగడం మనం దాని గురించి ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటు. డాక్టర్ ఆత్మ ఎటూ శాంతించదు. అందుకే రెస్ట్ ఇన్ పీస్ సొసైటీ అనడం బెటర్. సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం’ అని ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.