డాషింగ్ డైరెక్టర్‌గా పేరుగాంచిన పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి అగర్వాల్, నభా నటేశ్‌ల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాతే ఈ ఇద్దరి పోరీలకు తెగ అవకాశాలు వచ్చేస్తున్నాయ్. ఇప్పటికే నిధి.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు గాను భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది ఈ భామ. మరోవైపు ఐటెం సాంగ్స్‌లో అవకాశలొస్తున్నాయని వార్తలు వినవస్తున్నాయ్.
ఇక నభా నటేశ్ విషయానికొస్తే.. రవితేజతో జోడీ కట్టి ‘డిస్కోరాజా’లో నటించింది. ఈ సినిమా వచ్చేనెల చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు.. సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలోనూ ఈ సుందరి ఛాన్స్ కొట్టేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా నటించాలని నభా నటేశ్‌ను గట్టిగానే పారితోషికం ఇచ్చుకోవాలని డిమాండ్ చేసిందట. అయినా దర్శకనిర్మాతలు ఇవ్వడానికి సిద్ధమయ్యారట.
ఇవన్నీ అటుంచితే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కూడా ఈ ఇస్మార్ట్ పోరీలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటితో వరుణ్ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే బాక్సింగ్ ట్రైనింగ్ కోసం ముంబైలో ఆయన బిజిబిజీగా ఉన్నాడు. డిసెంబర్‌లో సినిమా షూటింగ్ షురూ కానుంది. అయితే ఈ సినిమాలో నటించాలని ఇస్మార్ట్ పోరీలను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మెగా హీరోల సరసన నటించడానికి ఎవరు మాత్రం సిద్ధంగా ఉండరు..! మొత్తానికి చూస్తే.. ఇస్మార్ట్ పోరీలు మెగా కాంపౌండ్‌లోకి షిప్ట్ అవుతున్నారన్న మాట. ఇదే నిజమైతే ఈ ఇద్దరి సుడి తిరిగినట్లేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.