టైటిల్ చూడగానే మీరు నవ్వుకున్నా.. ఆశ్చర్యానికి లోనైనా ఇది అక్షరాలా నిజం. ఒక్కసారి రూ. 300 రూపాయిలు పెట్టి టికెట్ కొంటే 150 సినిమాలు ఐదు నెలలు అనగా 150 రోజుల పాటు ఎంచక్కా చూసేయచ్చు. అంటే చిరు మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ మొదలుకుని ‘ఖైదీ నంబర్-150’ వరకూ అన్ని సినిమాలు చూసేయొచ్చన్న మాట. ఇంతకీ ఈ సినిమాలన్నీ ఎక్కడ.. ఏ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారో అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇదిగో పక్కనుండే ప్రకటన చూస్తే మీకే ఇది నిజమా..? అబద్ధామా అనేది అర్థమవుతుంది. ఏపీలోని.. కడప జిల్లాలోని ప్రొద్దటూరు రామేశ్వరం థియేటర్‌లో చిరు 150 సినిమాలు ప్రదర్శించబోతున్నారు. అయితే ఇలా ఇంత తక్కువ రేటుకే టికెట్ అమ్మి మరీ.. ఐదు నెలలపాటు సినిమా షోలు ఆడించడానికి ఓ పెద్ద కారణమే ఉందండోయ్. వండర్ వరల్డ్, లింకా బుక్ ఆఫ్ రికార్డులలో చోటు కోసం ఈ థియేటర్ యాజమాన్యం ఈ ప్రయత్నం చేస్తోంది. ఆ విషయం కూడా ప్రకటనలోనే సదరు థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాదు.. మీ బ్లడ్ గ్రూప్ ఏదనేది కూడా టెస్ట్ చేసి చెబుతారు.
వాస్తవానికి రాయలసీమలో మెగాస్టార్‌కు అభిమానులు పెద్ద ఎత్తునే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన పోటీ చేసినప్పుడు సొంత ఇలాఖాలో ఓడినప్పటికీ తిరుపతిలో గెలిచారంటే ఏ రేంజ్‌లో అభిమానులు శ్రమించి గెలిపించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో అయితే మెగాభిమానులకు కొదువలేదు. ఆ ఫ్యాన్స్ సందడి చూడాలంటే రిలీజ్ సినిమా రోజు ఓ లుక్కేస్తే తెలుస్తుంది. ఇక రూ. 300కే 150 సినిమాల బంపరాఫర్‌ను మెగాభిమానులు ఏ మాత్రం వాడుకుంటారో..? ఎక్కడెక్కడ్నుంచి వచ్చి అభిమాన హీరో సినిమాలు చూస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.