టాలీవుడ్ సూపర్‌స్టార మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. 2020 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ఇంతవరకూ ప్రమోషన్ చేసిన దాఖలాల్లేవ్. అప్పుడప్పుడు సింగిల్ అంటూ చిన్నపాటి లుక్స్ తప్ప చిత్రబృందం చేసిందేమీ లేదు. ఈ మధ్యే టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. అటు యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తూ.. ఇటు మహేశ్ అభిమానుల ఆదరాభిమానులు పొందింది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రకరకాలుగా వార్తలు రాగా.. తాజాగా ఓ పే.. ద్ద పుకారు షికారు చేస్తోంది. సినిమా దాదాపుగా 3 గంటల పాటు రూపుదిద్దుకోనుందని ఆ పుకారు సారాంశం. అయితే దీన్ని ఎలా తగ్గించాలో తెలియక దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారట. దీంతో మహేశ్ బాబు రంగంలోకి దిగి ఇలా అయితే కష్టం కదా.. అంత సేపు అభిమానులు, సినీ ప్రియులను సీటులో కూర్చోబెట్టాలంటే కుదరని పని కదా..? అని దర్శకనిర్మాతలకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. కావాలంటే ఒకట్రెండు సీన్‌లు కట్ చేసైనా సరే ఎడిటింగ్‌లో 15 నిమిషాలు కుదించాలని గట్టిగా చెప్పారట. ఎందుకంటే సినిమా లాంగ్ లెంగ్త్ ఉండటంతో ‘సాహో’, ‘సైరా’ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమేర నష్టం మాత్రం జరిగిపోయింది. అందుకే ముందుగానే అలెర్ట్ అయిన మహేశ్ డ్యూరేషన్ తగ్గించాలని పట్టుబట్టాడట.
మహేశ్ చెప్పడంతో దిల్ రాజు దగ్గరుండి మరీ ఎడిటింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. మరోవైపు అనీల్ కూడా ఎక్కడ కట్ చేస్తే బాగుంటుంది..? ఎవరి సీన్స్ లేపేయాలి..? కామెడీ లేపేద్దామా..? లేకుంటే ఫైట్ సీన్స్ లేపేద్దామా..? అని యోచిస్తున్నాడట. సినిమాలనగా పుకార్లు పుట్టడం సహజమే. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందంలో ఎవరో ఒకరు రియాక్ట్ అయితే కానీ క్లారిటీ రాదు.