టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి నటీనటులుగా టి.సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిరుతో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అర్జున్ సురవరం’ చిత్రబృందానికి ఆయన ఆల్ దిబెస్ట్ చెప్పారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హీరో, హీరోయిన్, నిర్మాత, డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్కరి గురించి మూడు ముక్కలు చెప్పారు. ప్రజల్లోకి వెళ్లాల్సిన సినిమా అని, ఇలాంటి మంచి సినిమా గురించి కచ్చితంగా ప్రచారం చేయాలని, ప్రేక్షకులకు తెలియజేయాలని.. అందుకే ఈ చిత్రానికి తనవంతుగా ప్రచారం కల్పించడానికి తానే స్వయంగా ఈ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటుచేయమని చెప్పినట్లు చిరు చెప్పారు.
అయితే.. లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ చిరు కాస్త సిగ్గుపడ్డారు. ఎందుకంటే అసలు ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక.. కానీ చివరికి మాత్రం చెప్పాల్సింది చెప్పేశారు. ‘లావణ్యా నీ గురించి ఒక విషయం చెప్పేస్తాను ఏమనుకోకే.. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నవ్వేటప్పుడు ఆ సొట్టబుగ్గలు.. డింపుల్ భలే ఉంటుందిలే. మారుతి సినిమాలో లావణ్యను కళ్లు ఆర్పకుండా చూశాను. అంత బాగా చేసింది. మారుతి ఆ అమ్మాయిని అంత బాగా చూపించారు. ఈ సినిమాలో మరో కోణంలో అంతే బాగా చేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. ఆమె ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. నాలాంటోడు కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా ద్వారా మరొక మెట్టు ఎక్కుతుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ సినిమాకి చాలా హెల్ప్ జరిగింది’ అని చిరు తన మనసులోని మాటను చెప్పేశారు. అయితే చిరు ఇలా మాట్లాడుతున్నంత సేపు లావణ్య సిగ్గుతో ఏం రిప్లై ఇవ్వాలో తెలియక కిందికి చూస్తూ నవ్వుకుంది.