టాలీవుడ్ హీరోలపై అస్తమానూ ఏదో ఒక మాట అనడం ఇదిగో ఈ ప్రముఖ కెమెరామెన్ చోటా.కె నాయుడికి పరిపాటిగా మారుతూ వస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో హీరో హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. స్టేజ్‌పైనే హీరోయిన్లను ముద్దాడి వార్తల్లో నిలిచిన చోటా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైయిల్‌తో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అంతటితో సైలెంట్‌గా ఉండుంటే సరిపోయేదేమో.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సెన్సేషనల్ కోసం ఇలా అడిగాడో లేకుంటే తానే సెన్సేషన్ కావాలని చోటా ఇలాంటి సమాధానం చెప్పాడో తెలియట్లేదు కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రం ఆయన హాట్ టాపిక్ అయ్యాడు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ‘కొత్త’ అనే ఓ మోజులో ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ‘తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువయ్యింది. వాళ్లు ఎలా చెబితే అలానే అన్నీ నడుస్తున్నాయ్.. అలా ఆడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కెమెరామెన్స్ లేనట్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కొత్త టెక్నికల్ టీమ్‌ను తెచ్చుకుంటున్నారు. ఇలా పసలేని కెమెరామెన్స్‌ను తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో సినిమా పూర్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వాళ్లు లైటింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు.. దాన్ని మనోళ్లు పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ వాళ్లతోనే మన దర్శకనిర్మాతలు చేయిస్తూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది మన కెమెరామెన్స్‌కు ఉపాధి కోల్పోతున్నారు. వాస్తవానికి ఇప్పట్లో మనవాళ్లకు పెద్దగా పనులు లేకుండా పోయాయ్. నేను ఏ మూవీకి చేసినా చాలా బాధ్యతాయుతంగా ఉంటాను. అందుకే నేను చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి’ అని చోటా చెప్పుకొచ్చాడు.
చోటా తన అభిప్రాయాన్ని.. మనసులోని మాటలను ఎన్నిరోజులుగా దాచుకొని ఉన్నాడో ఈ ఇంటర్వ్యూలో ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వేదికగా మనసులోని మాటలన్నీ బయటపెట్టేశాడన్న మాట. వాస్తవానికి హీరోయిన్లు మొదలుకుని ఆర్టిస్టులు, కెమెరామెన్లు, మ్యూజిక్ డైరెక్టర్లను సైతం బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడెక్కడ్నుంచో మన దర్శకనిర్మాతలు తీసుకొస్తున్నారు. అయితే మనోళ్లు ఉన్నారు.. వాళ్లకూ అనుభవం ఉంది కదా.. అవకాశం ఇచ్చి చూద్దామని మాత్రం అనుకోవట్లేదు. చోటా లాగే పెద్ద పెద్ద సీనియర్ నటీనటులు సైతం ఈ విషయంలో కుండ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.